మల్కాజిగిరి, ఫిబ్రవరి 14: “సారు ఇక్కడ పోరగాండ్లు రోజూ గంజాయి తాగుతున్నరు. ఆళ్ల జీవితం పాడైతుంది. ఆళ్లను సరిజేసి ఓ దారి చూపాలె” అని ఓ తల్లి, “ఇక్కడ తాగునీటి సమస్య ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నం’ అని ఓ చెల్లి, “సారో మాకు రేషన్ కార్డులు, పింఛన్లు కావాలె” అని ఓ అయ్య, “మాకు జిమ్ కావాలె సార్” అని ఓ యువకుడు ఇట్లా.. ఎన్నో సమస్యలను స్థానికులు ‘ప్రజా దర్బార్’లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు ఏకరువు పెట్టారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ‘దర్బార్’ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. దర్బార్ వేదికపై నుంచి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరిస్తూ, సమస్యలను తెలియజేయాలని కోరారు. ఇలా.. యువత జిమ్ కావాలని అడిగిన మరు క్షణమే.. రూ.10 లక్షలను జిమ్ కోసం మంజూరు చేశారు. సభలోని వారిని సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారం చూపారు.
సమస్యల పరిష్కారానికే ‘దర్బార్’
ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ‘ప్రజా దర్బార్’ నుంచి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ భరత్‌నగర్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ‘ప్రజా దర్బార్’ను సోమవారం అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో రూ.1100 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. భరత్‌నగర్‌లో రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులను సైతం పూర్తిచేసినట్టు చెప్పారు. 2003లో హౌసింగ్ బోర్డు ద్వారా కట్టిన భవనాలకు నీటి సౌకర్యం లేక పోవడంతో ట్యాంకర్ల ద్వారా అక్కడ నీటిని సరఫరా చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నల్లా కనెక్షన్ల కోసం వాటర్ వర్క్స్ ఎండీ దాన కిశోర్‌కు సభా వేదిక నుంచి ఫోన్ చేసి, వివరాలు తెలుసుకొని ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇప్పించేందుకు ఆమోదం పొందారు. జోనల్ కమిషనర్ మమతతో మాట్లాడి స్థానికంగా ‘సీసీ రోడ్ల’ను నిర్మించేందుకు అంగీకరించారు. ప్రజా వేదిక ఆసాంతం సమస్యలు పరిష్కరించేదిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో డీసీ నాగమణి, ఈఈ రాజు, వాటర్ వర్క్స డీఎం సునీల్, డీఈ మహేష్, ఏఈ రవళి, పీఓ రజిని, కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్, ప్రేమ్ కుమార్, అనిల్ కిశోర్, సురేందర్ రెడ్డి, మల్లికార్జున్ యాదవ్, గద్వాల జ్యోతి పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రి కేసీఆర్
దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి కేసీఆర్. నగరం ఓ మినీ ఇండియా. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుపరిచాం. ఆనంద్‌బాగ్ ఆర్యూబీ, మౌలాలి కమాన్ సమస్యలను పరిష్కరించాం. మంత్రి కేటీఆర్ సహకారంతో వరద ముంపు రాకుండా బాక్స్ డ్రైన్లను నిర్మిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల అనుమతితో ప్రతి వారం ఒక్క డివిజన్లో ప్రజా దర్బర్‌ను నిర్వహిస్తాం. దేశంలో తెలంగాణను ఆగ్రస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్న మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
– ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
సమస్యలు పరిష్కరిస్తున్నారు
ప్రజా దర్బార్ వేదిక ద్వారా సమస్యలు పరిష్కరించడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగలేదు. స్వయంగా ఎమ్మెల్యే, అధికారులు వచ్చి మా సమస్యలు తెలుసుని పరిష్కరించడం హర్షణీయం. బస్ సౌకర్యం మెరుగుపడాలి. రాత్రుల్లో పోలీసులు గస్తీ తిరగాలి.
– సుజాత, భరత్‌నగర్
సమస్యలు పరిష్కరించేలా దర్బార్
ప్రజా దర్బార్ నిర్వహణ స్థానికంగా చోటు చేసుకున్న ఎన్నో సమస్యలను పరిష్కరించేలా సాగడం హర్షణీయం. ఇక్కడంతా పేదోళ్లం నివసిస్తున్నాం. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి. నీటి సమస్యను పరిష్కరించడానికి ఏర్పాట్లు చేయడం చాలా ఆనందంగా ఉంది. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలి.
– రాజమ్మ, భరత్‌నగర్