సిటీబ్యూరో, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): విమానంలో వస్తారు…సైకిల్ పై రెక్కీ చేస్తారు…చోరీ సొత్తుతో రైలెక్కి చెక్కేస్తారు. ఇలా నాలుగేండ్లగా దొంగతనాలకు పాల్పడుతూ.. తప్పించుకొని తిరుగుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు దొంగలను సోమవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నేరేడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం..గత డిసెంబర్ 18న వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి..30 తులాల బంగారంతో పాటు వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు పశ్చిమబెంగాల్‌కు చెందిన రఫీకుల్ ఖాన్, షేక్ సూరజ్‌లను ఈనెల 4న అరెస్టు చేశారు. విచారణలో వీరి నేరాల చిట్టా బయటపడింది. నాలుగేండ్లుగా 14 ఇండ్లలో చోరీలు చేసినట్లు తేలింది. నిందితుల నుంచి రూ. 27.41 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు కొంటున్న రిసీవర్లు అనిల్ సీతాతం బాంగర్ను అరెస్టు చేయగా, నోబిన్ పరారీలో ఉన్నాడు.
బస్తీల్లో అద్దెకుంటూ..
పశ్చిమ బెంగాల్ ముర్షీదాబాద్‌కు చెందిన రఫీకుల్ ఖాన్, షేక్ సూరజ్ మేస్త్రీ పనులు చేస్తుంటారు. ఆ సంపాదన సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌కు విమానంలో వచ్చే వీరిద్దరూ.. రాజేంద్రనగర్, హయత్‌నగర్, సూర్యపేట ప్రాంతాల్లోని సంపన్నుల కాలనీలకు సమీపంలో ఉన్న బస్తీల్లో గదిని అద్దెకు తీసుకుంటారు. ఈ క్రమంలో వనస్థలిపురంలో ఓ సైకిల్‌ను కొనుగోలు చేసిన వీరు.. దానిపై తిరుగుతూ.. తాళం కనిపించిన ఇండ్లను నిమిషాల వ్యవధిలో దోచుకునేవారు. సైకిల్‌ను వారు అద్దెకు ఉన్న మూడు ప్రాంతాల్లోని ఏదో ఒక గది వద్ద పెట్టేసి రైలెక్కి వెళ్లిపోతారు. సొంతూరుకు వెళ్లి జల్సాలు చేస్తారు. డబ్బులన్నీ అయిపోగానే రొటీన్‌గా చోరీలకు తెగబడుతారు. ఇలా ఈ దొంగలు రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో 11, సూర్యాపేటలో 2, రాజేంద్రనగర్‌లో 1 చోరీలు చేసినట్లు వెల్లడైంది.
కాల్స్‌ను విశ్లేషించి..
వనస్థలిపురం చోరీ కేసును ఛేదించేందుకు సీపీ మహేశ్ భగవత్ సీసీఎస్, క్రైం, ఐటీ సెల్ బృందాలను రంగంలోకి దింపారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకొన్న పోలీసులు బృందాలు.. వారి దర్యాప్తు అప్డేట్లతో పాటు ఇతర రాష్ర్టాల నేరస్తుల వివరాలను ఎప్పటికప్పుడు సమాచారం షేర్ చేసుకున్నాయి. దాదాపు 70 వేలకు పైగా కాల్ డేటాలను విశ్లేషించారు. చివరకు ఈ దొంగలు పశ్చిమ బెంగాల్ వాసులుగా తేల్చి పట్టుకున్నారు.
చెన్నైలో నమోదైన వేలి ముద్రలు..
రాచకొండ పోలీసు బృందాలు నిందితుల కోసం ఒక వైపు గాలిస్తుండగా, మరో వైపు ఫింగర్ ప్రింట్స్ బ్యూరో వనస్థలిపురంతో పాటు పలు చోరీ కేసుల సంఘటన స్థలాల్లో దొరికిన వేలి ముద్రలను సేకరించింది. మొత్తం లక్ష వేలి ముద్రలను పరిశీలించారు. ఎక్కడ కూడా నిందితుల ఫింగర్ ప్రింట్లతో పోలలేదు. అయినా పట్టు వదలకుండా దేశంలోని అన్ని రాష్ర్టాల్లో వివిధ రకాల నేరప్రక్రియను జల్లెడ పట్టారు. రఫీకుల్ ఖాన్ చెన్నైలో జూదం ఆడే సమయంలో దొరికాడు. చెన్నై పోలీసులు అతడి వేలి ముద్రలు తీసుకొని..ఉన్నతాధికారి దగ్గర హాజరుపర్చి బైండోవర్ చేశారు. చెన్నై డేటా బేసును చూసినప్పుడు ఇక్కడి ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అధికారులకు వనస్థలిపురం దొంగ వేలి ముద్రలు లభించాయి. అప్పుడు ఈ చోరీ చేసిన దొంగ రఫీకుల్ ఖాన్ అని తేలడంతో దర్యాప్తు బృందాలకు నిందితులను పట్టుకోవడం మరింత సులువైంది.
బాధితుల ఆనందం..
ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోలేదు. పోలీసులు మా సొత్తును తిరిగి ఇచ్చేందుకు పడ్డ శ్రమ, ఫిర్యాదు ఇవ్వగానే స్పందించిన తీరుతో వెంటనే మా కాలనీలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా’నని మాజీ వీఆర్వో అంజయ్య ఆనందం వ్యక్తం చేశారు. ‘రెండేండ్ల తర్వాత చోరీ అయిన మా సొత్తు దొరికిందని పోలీసులు చెప్పడంతో నా ఆనందానికి అవధుల్లేవు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నా’.. అని మరో బాధితుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి