ఖైరతాబాద్, ఫిబ్రవరి 14 : ఆస్తి పన్ను వసూళ్లలో.. ఖైరతాబాద్ జోన్ దూసుకుపోతున్నది. గతేడాది కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో కొంత జాప్యం జరిగినా, చెల్లింపులు మాత్రం యథావిధిగా కొనసాగాయి. విశ్వనగరాభివృద్ధిలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆస్తి పన్నులే కీలకం. ఈ క్రమంలో బల్దియా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి చేత పన్నులు సకాలంలో చెల్లించేలా చొరవ తీసుకుంటున్నారు. బల్క్ మెసేజ్‌లు పంపిస్తూ, మొండి బకాయిదారులకు రెడ్‌నోటీసులు, వారెంట్లు జారీ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సిటిజన్ సర్వీస్ సెంటర్, బిల్ కలెక్టర్లు, మీ సేవతో పాటు ఆన్‌లైన్‌లోనూ చెల్లింపునకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది సర్కిల్ 17, 18 పరిధిలో రికార్డు స్థాయిలో రూ. 237.85 కోట్ల కలెక్షన్స్ రావడం విశేషం.
రూ.237.85 కోట్ల ఆదాయం
ఆస్తి పన్నుల చెల్లింపునకు వచ్చే నెల 31వ తేదీ చివరి రోజు కావడంతో మరో నెల రోజుల ముందే నిర్ణీత టార్గెట్‌ను పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యాయి. క్షేత్రస్థాయిలో బిల్ కలెక్టర్లు నేరుగా యజమాని ఇండ్లకు వెళ్లి అక్కడికక్కడే పన్నులు సేకరిస్తున్నారు. మరికొందరు వినియోగదారుల సేవా కేంద్రం, మీసేవ, ఇంకొందరు ఆన్లైన్లో చెల్లిస్తున్నారు. గత ఏడాది కాలంగా చెల్లించని మొండి బకాయిదారులకు ఇప్పటికే రెడ్‌నోటీసులు, వారెంట్లు జారీ చేయగా, కొందరి నుంచి సానుకుల స్పందన వచ్చింది. అధికారుల చొరవతో పలు చెక్‌బౌన్స్ కేసులు సైతం పరిష్కారమయ్యాయి. సర్కిల్ 17 పరిధిలో ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్‌పేట, సనత్ నగర్‌తో పాటు సర్కిల్ 18లోని జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, బంజారాహిల్స్, షేక్‌పేట డివిజన్లలో ఈ సారి పెద్ద ఎత్తున ఆస్తి పన్నుల చెల్లింపులు జరిగాయి. ఖైరతాబాద్ సర్కిల్లో మొత్తం 44,793 అసెస్మెంట్లకు గాను, రూ.109.91 కోట్లు, జూబ్లీహిల్స్ సర్కిల్లో 40,666 అసెస్మెంట్లకు రూ.127.94 కోట్ల పన్నుల రూపంలో వచ్చాయి. రెండు సర్కిళ్లు కలిపి మొత్తం రూ.237.85 కోట్లు వసూలయ్యాయి.
నిర్ణీత కాలంలో చెల్లించండి
ఆస్తి పన్నుల చెల్లింపు కోసం అనేక వెసులు బాటు కల్పించాం. సిటిజన్ సర్వీస్ సెంటర్ లేదా బిల్ కలెక్టర్లకు నేరుగా అందించవచ్చు. ఇంటి వద్దనే కూర్చోని ఆన్లైన్లో సైతం చెల్లించవచ్చు. ఆస్తి పన్నుల చెల్లింపుల్లో అలసత్వం వద్దు. నిర్ణీత కాలంలోగా ప్రతి ఒక్కరూ చెల్లించాల్సిందే. మార్చి 31 వరకే సమయం ఉన్నందున్న జరిమానాలు లేకుండా చెల్లించాలని కోరారు.
– వంశీకృష్ణ, సర్కిల్ 17 డిప్యూటీ కమిషనర్