సికింద్రాబాద్, ఫిబ్రవరి 14 : కంటోన్మెంట్ పరిధిలో ఉచిత తాగునీటి పథకం అమలుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించే దిశగా టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఈ మేరకు ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జీహెచ్ఎంసీలో మాదిరిగా కంటోన్మెంట్లో సైతం ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలకు తెలిసే విధంగా గులాబీ శ్రేణులు నడుం బిగించారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కంటోన్మెంట్లో అందిస్తున్నదనే విషయాన్ని బస్తీ, కాలనీవాసులకు తెలిపే కార్యాచరణకు ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో బోర్డు మాజీ సభ్యులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి సుమారు 30 వేల స్టిక్కర్లను సిద్ధం చేయించారు. వీటిని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. దీంతో స్టిక్కర్లను ఇప్పటికే ఆయా వార్డులకు చెందిన ప్రజాప్రతినిధులకు అందజేయడం జరిగింది.
ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే..
రాష్ట్ర సర్కారు కంటోన్మెంట్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన తెచ్చేందుకు కంటోన్మెంట్ గులాబీ సైన్యం సన్నద్ధమవుతుంది. నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికెళ్లి సంక్షేమం , అభివృద్ధి కార్యక్రమాలపై వివరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కంటోన్మెంట్లో అమలు చేయకున్నా ఇక్కడి కాషాయం నేతలు గొప్పలు చెప్పుకుంటున్న తీరుతెన్నులను వివరించేందుకు గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు.
కంటోన్మెంట్ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై
ఉచిత తాగునీటి పథకం అమలు చేసిన రాష్ట్ర సర్కారుకే చెందిందనే విషయాన్ని కంటోన్మెంట్‌లోని ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎనిమిది వార్డుల్లోని ప్రతి ఇంటికి తెలిసే విధంగా స్టిక్కర్లను అంటించనున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకం కంటోన్మెంట్లో అమలవుతుందన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కంకణం కట్టుకుని ఉందని, కేంద్రం కంటోన్మెంట్‌పై వివక్ష చూపుతూ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. రహదారుల విస్తరణ, స్కై వేల నిర్మాణాలు, రక్షణ స్థలాల్లో నివాసముంటున్న వారికి పట్టాలు ఇవ్వకుండా చోద్యం చూస్తుందన్నారు. ప్రజలకు అన్నిల విషయాలపై త్వరలోనే అవగాహన కల్పించే విధంగా ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.