సికింద్రాబాద్, ఫిబ్రవరి 14: బోర్డు పరిధిలో గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న చెత్త కార్మికులకు నష్టం కలగకుండా చూస్తానని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం చెత్త కార్మికులతో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. బోర్డు నూతన సంస్కరణలో భాగంగా చెత్త తరలింపునకు సంబంధించి ఇటీవల ఫూణేకు చెందిన స్వయుంబు అనే సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. అయితే గతంలో మాదిరిగా కాకుండా బోర్డుకు చెందిన సిబ్బందే నేరుగా ఇంటి చెత్త పన్నును వసూలు చేయనున్నారు.
దీంతో పాటు తమ పాత వాహనాలు కాకుండా ఫోర్ వీలర్స్ వాహనాలనే వాడాలనే నిబంధన, ఇండ్ల వద్ద డబ్బులు వసూలు చేయకూడదని బోర్డు అధికారుల నిర్ణయంతో జీవనోపాధి కోల్పోతున్నామని కొద్ది రోజులుగా సుమారు 200మంది చెత్త కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కార్మికులు సమస్య పరిష్కారానికై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిని సంప్రదించారు. సానుకూలంగా స్పందించిన జక్కుల త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేవిధంగా కృషి చేస్తానని చెప్పారు.