అమీర్‌పేట్, ఫిబ్రవరి 14: సమస్యలను పరిష్క రించేందుకు తనతో పాటు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు అందరూ అందుబాటులో ఉంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సోమవారం సనత్‌నగర్ డివిజన్లోని బాలయ్యనగర్ బస్తీలో మంత్రి పర్యటించారు. ముఖ్యంగా బాలయ్యనగర్‌లో తాగునీటి లోప్రెషర్ సమస్య, డ్రైనేజీ, రోడ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని, చెత్త సేకరణలో ఆలస్యం, రోడ్లను ఆక్రమిస్తూ చేపడుతున్న నిర్మాణాలు, నిరుపయోగంగా ఉంటున్న కార్లను రోడ్లపైనే వదిలేస్తుండటంతో ఎదురవుతున్న ఇబ్బందులు వంటి అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, జలమండలి జీఎం హరిశంకర్, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రియలను సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశిం చారు. నియోజకవర్గం పరిధిలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, బాలయ్యనగర్ ప్రతినిధులు సురేశ్ పెరమాండ్ల, గంజి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.