బన్సీలాల్‌పేట్, ఫిబ్రవరి 14 : సనత్‌నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం భోలక్‌పూర్‌లోని మేకలమండి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సాధన కమిటీ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఏడో తరగతి వరకు ఉన్నదని, ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిదవ తరగతిని ప్రవేశపెట్టాలని, అలాగే అదనపు తరగతి గదులను నిర్మించాలని వారు కోరారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాక విద్యార్థుల నమోదు శాతం పెరిగిందని, అద్భుతమైన ఆదరణ లభిస్తున్నదని మంత్రికి తెలిపారు. స్పందించిన మంత్రి తలసాని మాట్లాడుతూ సర్కారు బడులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘మన బస్తీ-మన బడి’ పథకం ప్రవేశ పెట్టిందని, అందులో భోలక్‌పూర్ పాఠశాలను కూడా చేర్చేలా విద్యాశాఖ మంత్రికి సిఫారసు చేస్తానని పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎం మల్లికార్జున్ రెడ్డి, ఉన్నత పాఠశాల సాధన కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్, కో-కన్వీనర్లు నర్సింగ్‌రావు, శేషగిరిరావు, టీఆర్ఎస్ నాయకులు ఫహీమ్, ప్రేమ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు తదితరులు పాల్గొన్నారు.