ప్రజలు నమ్మి గెలిపించారు. ప్రజా ప్రతినిధిని చేశారు. అలాంటి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. సమస్యలరహిత సమాజాన్ని అందించాలి.
నేడు మల్కాజిగిరిలో ప్రజాదర్బార్ ప్రారంభం
ప్రతిరోజు ఒక డివిజన్లో.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో పాటు పాల్గొననున్న అన్నిశాఖల అధికారులు
అక్కడే సమస్యలన్నీ పరిష్కారం
గౌతంనగర్, ఫిబ్రవరి 13 : ప్రజలు నమ్మి గెలిపించారు. ప్రజా ప్రతినిధిని చేశారు. అలాంటి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. సమస్యలరహిత సమాజాన్ని అందించాలి. అదే తన ధ్యేయమంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ముందుకు కదిలారు. ఎన్నికల ముందు కాలనీలకు ఓటు కోసం ఎలా వెళ్లానో.. అదే విధంగా ప్రతి బస్తీకి వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపడంతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను లబ్ధిదారులకు చేరవేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు ఓ ప్రత్యేక వాహనాన్ని రూపొందించగా.. మంత్రి కేటీఆర్ లాంచనంగా ప్రారంభించారు.
నేడు భరత్‌నగర్‌కాలనీలో…
సోమవారం నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని నేరేడ్మెట్ డివిజన్ కౌకూర్‌లోని భరత్‌నగర్‌కాలనీలో ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రజాదర్బార్ వేదికగా పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రజాదర్బార్‌లో అన్ని శాఖల అధికారులు
నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక డివిజన్లో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ, విద్యుత్, పౌరసరఫరాలు, వైద్యం, పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల, జలమండలి తదితర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలు కోరుతున్న పనులు, అభ్యర్థనలు, ఫిర్యాదులకు వెంటనే అధికారులు పరిష్కారం చూపుతారు.