సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 ( నమస్తే తెలంగాణ ) : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సంబురాలను అంబరంగా నిర్వహించాలని, పార్టీ శ్రేణులు, అభిమానులకు మాగంటి పిలుపునిచ్చారు. 15వ తేదీన అన్నదానాలు, 16న రక్తదాన శిబిరాలు, 17న సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలతో సేవా దృక్పథాన్ని చాటాలని చెప్పారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని గురువారం యూసుఫ్‌గూడలోని పోలీస్‌లైన్స్ మైదానంలో శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. 120 అడుగుల భారీ వేదిక, 5వేల వరకు భక్తులు పాల్గొననున్న ఈ కల్యాణ మహోత్సవాన్ని టీటీడీ వేదపండితులతో అత్యంత భారీగా నిర్వహిస్తున్నామని మాగంటి తెలిపారు.