చీమచీటుక్కుమన్నా..తెలిసేలా.. టెక్నాలజీ.. నిరంతర పర్యవేక్షణ, ప్రతి కదలికపై నిఘా..ఇలా అందిపుచ్చుకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ అత్యంత సురక్షితమైన…ప్రశాంతమైన నగరంగా ప్రసిద్ధి చెందుతోంది. అణువణువునా..రక్షణ ఛత్రంతో శాంతిభద్రతల పర్యవేక్షణలో దేశంలోనే నంబర్ 1సిటీగా ఖ్యాతి గడించింది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): విద్యార్థులైనా.. ఉద్యోగులైనా, బతుకుదెరువు కోసం వచ్చిన వారైనా.. ఎవరైనా సరే.. హైదరాబాద్ సేఫ్ సిటీ అంటూ..కితాబిస్తున్నారు. ఇక్కడ స్థిరనివాసం ఉండేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. సంతోషంగా నివాసముంటున్నారు. ఏ క్షణమైనా.. అందే పోలీసుల సేవలతో అర్ధరాత్రి అయినా.. సురక్షితంగా రోడ్లపై ప్రయాణిస్తూ.. ఇంటికి క్షేమంగా చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్నారంటే తమ బిడ్డలు, కుటుంబసభ్యులు సేఫ్‌గా ఉంటారనే నమ్మకం ఇప్పుడు దేశవిదేశాల్లో ఉంటున్న వారికి ఏర్పడింది. డయల్ 100కు ఫోన్ చేస్తే..ఐదు నిమిషాల్లోనే పోలీసుల సేవలు లభిస్తుండటంతో సిటీలో ‘ఐ యామ్ సేఫ్’ అన్న భరోసా పౌరుల్లో ఏర్పడింది. అంతేకాకుండా విదేశాల్లో బ్రాండ్లుగా పేరొందిన ఎన్నో కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడే నెలకొల్పుతున్నాయి.
30 మందికి..
విజిబుల్ పోలీసింగ్‌తో పౌరులకు భద్రత పెరిగింది. నేరం చేయాలంటేనే నేరస్తుల్లో వణుకు పుట్టేలా నగరాన్ని సీసీ కెమెరాలు నిరంతరం డేగ కండ్లతో పర్యవేస్తున్నాయి. ప్రభుత్వం, ప్రజలు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఇలా అందరి భాగస్వామ్యంతో గ్రేటర్లో సుమారు 7 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి వెయ్యి మందికి 34 కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అంటే 30 మందికో ఓ కెమెరా భద్రత కల్పిస్తునట్లే. అలాగే సాంకేతిక పరికరాలు, సాఫ్ట్వేర్లను సమకూర్చుకోవడంతో ఎలాంటి కేసునైనా ఛేదించే సామర్థ్యం మన పోలీసుల వద్ద ఉంది.
24/7 వీక్షణం
కమాండ్ కంట్రోల్ కేంద్రాలకు సీసీ కెమెరాలు అనుసంధానం చేయడంతో ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి వరకు తమ పరిధిలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా చూసుకునే వీలు కలిగింది. 24/7 ప్రత్యక్ష వీక్షణంతో ఏ మూల ఏం జరుగుతుందో గమనించి.. పెట్రోలింగ్ చేసే సిబ్బందికి అలర్ట్‌లు పంపిస్తుండటంతో నిమిషాల వ్యవధిలో ఘటనాస్థలికి చేరుకోగలుగుతున్నారు. నిందితులు తప్పించుకునే వీలు లేకుండా పోతున్నది. గ్రేటర్‌వ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యం కాగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు రూ. 750 కోట్లతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది.