సికింద్రాబాద్, ఫిబ్రవరి 13: స్పీకర్‌జీ.. అంటూ.. ప్రభుత్వ, ప్రతిపక్ష, స్పీకర్, వివిధ శాఖల మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు పార్లమెంట్లో ప్రదర్శించే తీరును కండ్లకు కట్టినట్లు అద్భుతంగా ప్రదర్శించారు పోలీసు శిక్షణ అభ్యర్థులు. అధికార, ప్రతిపక్షాలు బాయ్‌కాట్ చేసే విధానాన్ని సైతం చక్కగా నిర్వహించి ఆకట్టుకున్నారు. ఇందుకు వంటిమామిడిలోని సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ శిక్షణ కేంద్రం వేదికైంది. ఆదివారం పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, శ్యామ్ ఇనిస్టిట్యూట్, గురునానక్ మిషన్ ట్రస్ట్, రాంకీ ఫౌండేషన్ల సంయుక్తాధ్వరంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ అదుర్స్ అనిపించింది. ఈ కార్యక్రమం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరవస్తు మధుకర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించగా, సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రధాని పాత్రలో..
ప్రధాని పాత్ర వేషధారణలో ఉన్న సమయంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వివరిస్తూ.. ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొడుతూ.. చేసే పాత్ర చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం శిక్షణ సమయంలో చేయడం మరింత సంతోషంగా ఉంది.
– ప్రేమ్‌దాస్, ఎస్ఐ అభ్యర్థి
స్పీకర్ పాత్రలో..
స్పీకర్ పాత్ర చేయడానికి చాలా ఓపిక ఉండాలి. ఈ అనుభూతి మరోసారి వస్తుందో రాదో కానీ పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది. అందులో నేను పాల్గొనడం ఒక అనుభూతి.
– కోటేశ్వర్, ఎస్ఐ అభ్యర్థి
ప్రతిపక్ష హోదాలో..
ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందా, దానిని ఎత్తి చూపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా..చేసిన విధానం, అదే సమయంలో స్పీకర్ మైక్ ఇవ్వకపోవడం వంటివి చేస్తున్న సమయంలో లీనమైపోయాం. అవకాశం వస్తే రాజకీయంగా ఎదిగి పార్లమెంట్లో అడుగుపెట్టాలని ఉంది.
– మనోహర్ అలీ, ఎస్ఐ అభ్యర్థి