ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 13 : సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు స్పష్టం చేశారు. పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే నాలుక కోస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన పలు బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలపై స్పందిస్తూ బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి చేశారంటూ, ఆ చిట్టా మొత్తం తన దగ్గర ఉందంటూ మాట్లాడే సంజయ్ దాన్ని దమ్ముంటే బయటపెట్టాలని సవాల్ చేశారు.
సీఎం కేసీఆర్ రాజకీయ జీవితం, ఉద్యమ చరిత్ర అంతా తెరిచిన పుస్తకమని అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు ఇంటింటికీ తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించి అపర భగీరథుడిగా నిలిచారని కొనియాడారు. కేసీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక బండి సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన ముందుకొస్తే ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని బండి సంజయ్ హామీ ఇస్తారా..? అని ప్రశ్నించారు.
కనీసం రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యాన్ని కేంద్రప్రభుత్వంతో కొనిపించలేని దద్దమ్మగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా చరిత్రలో నిలిచిపోతాడని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో రాష్ర్టానికి చేసిన మేలేంటో చెప్పిన తరువాత సంజయ్ మాట్లాడాలని సూచించారు. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి కేసీఆర్కు వస్తున్న మద్దతు చూసి ఆయన కడుపు మండుతున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లోపాయికారి ఒప్పందాల గురించి ప్రజలందరికీ తెలుసని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలు, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లమైందని చెప్పారు. ఇప్పటికైనా బండి సంజయ్ తన వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.