తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 13. సమాజానికి తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపిన పట్టాభిరామ్ తెలుగుజాతి రత్నం, గర్వించదగిన వ్యక్తి అని ఏపీ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ బీవీ పట్టాభిరామ్ రచించిన ‘సీక్రెట్ పవర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి జెజీషియన్గా రాణిస్తూనే వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు నిర్వహిచడంతో పాటు అనేక పుస్తకాలు రచించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. పట్టాభిరామ్ రచన సూత్రధారి గొప్ప పుస్తకంగా ఆయన అభివర్ణించారు.
సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రసంగాలకు అనుగుణంగా మార్గదర్శకమైన జీవితాన్ని కొనసాగించిన పట్టాభి కృషి గొప్పదని ప్రశంసించారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ వయసులో చిన్నవాడైన పట్టాభి నుంచి ఎంతో నేర్చుకున్నానని, పలు సందర్భాలలో ప్రజలను చైతన్యం చేసేలా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ఎమ్మెస్కో బుక్స్ చీఫ్ ఎడిటర్ జి.చంద్రశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మెజీషియన్ డాక్టర్ బీఎన్ఎస్ కుమార్, చొక్కాపు వెంకట రమణ, మిమిక్రీ కళాకారుడు మర్రి రమేశ్, మల్లం రమేశ్, సాహితీవేత్తలు ఎం.రఘురామ్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, తదితరులు పాల్గొన్నారు.