మల్కాజిగిరి, ఫిబ్రవరి 13: అల్వాల్ సర్కిల్లో ఆస్తిపన్ను వసూలులో అధికారులు వేగం పెంచారు.. మార్చి 31వరకు గడువు ఇచ్చి.. త్వరగా చెల్లించాలని అవగాహన కల్పిస్తున్నారు. సర్కిల్ పరిధిలో మొత్తం 156 కాలనీ లు, బస్తీలు.. ఇందులో దాదాపు 43,441గృహాలు, అపార్టుమెంట్లతో పాటు వాణిజ్య భవనాలు ఉన్నాయి. దాదాపు 3లక్షల మంది నివసిస్తున్నారు. సర్కిల్ పరిధిలో 2021-2022 ఆర్థిక సంవత్సరానికి రూ.28కోట్ల పన్ను వసూలు కు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ.21.14కోట్లు వసూలు కాగా.. మిగిలిన రూ.6.86కో ట్ల వసూలుకు ఇండ్ల యజమానులను కలసి కట్టమని డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారు.
ప్రస్తుతం మార్చి 31వరకు బకాయిలు ఉన్న రూ.6.86కోట్ల పన్నులు వసూలుకు టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ బిల్ కలెక్టర్లు, ఏఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు. కాగా.. కౌకూర్‌లోని వాటర్ ప్లాంట్ యజమాని రూ.8,23,057లక్షల పన్ను ను చెక్ ద్వారా చెల్లించగా.. అది బౌన్స్ కావడంతో గత వారం దాన్ని సీజ్ చేశారు. రెండు రోజుల కిందట సీవీఆర్ గార్డెన్ రూ.13.70లక్షలు, మరో ఫంక్షన్ హాల్ రూ.12లక్షల బకాయి, మెడిప్లస్ భవన సముదాయం రూ.4.70లక్షల బాకాయి పడిన ఆస్తులను డీసీ నాగమణి సీజ్ చేశారు. గత ఏడాది పన్నులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన వారికి రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు.