దుండిగల్, ఫిబ్రవరి 13 : గాజులరామారం సర్కిల్ పరిధి, సూరారంలోని శ్రీ కట్టమైసమ్మతల్లి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నగరం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణతో దర్శణమివ్వగా.. వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యా యి. డప్పుచప్పుళ్లు, శివసత్తుల శివాలు, పోతురా జుల వీరంగం, నృత్యాలతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో హోరెత్తింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అదే విధంగా కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ. వివేకానంద్, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్, దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ, మల్లారెడ్డి వైద్య విద్యాసంస్థల సీఎండీ డా.భద్రారెడ్డి, దుండిగల్ సీఐ రమణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు సైతం కట్టమైసమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన అతిథులను పూలమా లలు, శాలువాలతో ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.