సికింద్రాబాద్, ఫిబ్రవరి 13: ఆర్థికస్వావలంబన దిశ గా దళితులు అడుగులు వేయాలనే తలంపుతో రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలు ప్రక్రియ సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో వేగవంతమైంది. ఈ పథకం అమలుపై కలెక్టర్ శర్మన్ ప్రత్యేక దృష్టి సారించారు.మార్చి నెలాఖరులోగా గ్రౌండింగ్ పూర్తికానుంది.
రెండు వందల మంది ఎంపిక
దళితబంధులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. సికింద్రాబాద్‌తో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో 200 మందిని ఎంపిక చేశారు. వీరికి సంబంధించిన ధ్రువపత్రాల సేకరణ, విద్యాభ్యాసం తదితర వివరాలను సేకరిస్తున్నారు. వారి జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల మేరకు వారికి ఎలాంటి యూని ట్లు అందిస్తే ప్రయోజనం ఉంటుందనే అవకాశాలపై అధికారులు ఆలోచన చేస్తున్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న వంద శాతం రాయితీ నగదుతో మంచి ఫలాలు అందాలనే ఉద్దేశంతో లబ్ధిదారులకు అధికారులు పకడ్బందీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
త్వరలో సమావేశాల నిర్వహణ
దళితబంధుపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీక ర్ పద్మారావుగౌడ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తమ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉం డేలా చూడాలని, ఎవరూ చేతివాటం ప్రదర్శించవద్దని, అవినీతికి తావులేకుండా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. త్వరగా సర్వే పూర్తి చేసి లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు మార్చి మొదటి వారంలోగా పూర్తి స్థాయి గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. లబ్ధిదారులు ఒకే రకమైన యూనిట్లు కాకుండా ఇతర యూనిట్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు సంబంధించిన ధ్రువపత్రాలను సేకరించి బ్యాంకుల్లో అకౌంట్లు తెరుస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నారు.
దళితులకు కొండంత అండ సీఎం కేసీఆర్
అభివృద్ధికిదూరంగా ఉన్న దళిత కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం సీఎం కేసీఆర్ మొదట్నుంచి కొం డంత అండగా నిలుస్తున్నా రు.బ్యాంకు లింకేజీతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రు ణాలు సైతం అందించారు. దాదాపుగా ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ తనదైన రీతిలో దళితులకు మేలు చేసేందుకు కృషి చేశారు. తాజాగా దళితబంధు పథరకం అమలో భాగంగా నగరంలో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. తమకు ఇష్టమైన యూనిట్‌ను కొనుగోలు చేసుకుని స్వయం ఉపాధికి మార్గం సుగమం చేసుకునేందుకు లబ్ధిదారులు ఉత్సాహంగా ఉన్నారు. కంటోన్మెంట్‌లోని సుమారు 100 మందికి దళిత బంధు కింద రుణాలు అందిస్తాం.
-జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్