చిక్కడపల్లి, ఫిబ్రవరి13: ప్రభుత్వాలు సమగ్ర ఆరోగ్య విధానాలు అమలు చేయాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బాగ్‌లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘అందరికీ ఆరోగ్యం- పక్కగా వైద్య సేవలు’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల వద్ద ప్రజారోగ్యంపై స్పష్టమైన విధానం ఉండాలన్నారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు బాగానే ఉన్నా, అవి ఎంత మాత్రం సరిపోవన్నారు. తెల్లకార్డును దేనితో సంబంధం లేకుం డా, ఆరోగ్యశ్రీ, అన్ని రకాల సేవలను అందరికీ వర్తింపజేయాలన్నారు. మనదేశంలో ఔషధ రంగం చాలా బలంగా ఉందని, దాన్ని ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రపంచంలోనే మన దేశం అతి తక్కువ ధరకు ఔషధాలు తయారు చేస్తున్నదన్నారు. అమెరికాలో రూ.50 వేలు విలవచేసే ఔషధాన్ని మన దేశంలో కేవలం రూ.70కే అందిస్తున్నదన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఐఎంఏ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఆకుల సురేశ్‌బాబు, వరల్డ్ అసోసియేషన్ మెడికల్ లా డాక్టర్ చింతల రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కేటీఆర్, కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కటారి శ్రీనివాస రావు, రాజారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ ఉనారు.