ఎర్రగడ్డ, ఫిబ్రవరి 13: ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో ఉన్న బోరబండ ఔట్‌పోస్ట్ త్వరలో పోలీస్‌స్టేషన్‌గా మారనున్నది. రెండు నెలల్లో బోరబండకు పోలీస్‌స్టేషన్‌ను కేటాయించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బోరబండలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. సుమారు 40 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినప్పుడు దీని పరిధిలోని జనాభా 20 వేలు ఉండేది. క్రమంగా మౌలిక వసతులు సమకూరటంతో బోరబండ ప్రాంత జనాభా నేడు దాదాపుగా 2 లక్షలకు చేరింది. ఐతే ఆరేండ్ల క్రితం వరకు ఔట్‌పోస్ట్ అద్దె భవనంలోని ఇరుకు గదిలో కొనసాగింది. బాబా ఫసియుద్దీన్ ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి డిప్యూటీమేయర్ పదవిని చేపట్టగానే ఇరుకు గదిలో కొనసాగుతున్న ఔట్‌పోస్ట్‌ను సైట్-2 కాలనీలోని విశాలమైన కమ్యూనిటీహాల్ ప్రాంగణానికి తరలింప జేశారు. బోరబండలో పోలీస్‌స్టేషన్ ఆవశ్యకత గురించి గత ఐదేండ్లుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా పూర్తి స్థాయి ఠాణాకు తగ్గకుండా ఔట్‌పోస్ట్‌ను తీర్చిదిద్దారు. కొత్త సొబగులు దిద్దుకున్న దీన్ని హోంమంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోరబండలో త్వరలో ఠాణాను ఏర్పాటు చేయనున్నట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. కాగా బోరబండ ఔట్‌పోస్ట్ పరిధిలో బోరబండ డివిజన్ పూర్తి ప్రాంతం, రాజీవ్‌నగర్, బీఎస్పీ కాలనీ, కల్యాణ్‌నగర్ వెంచర్-3, హెచ్‌ఎఫ్‌నగర్, శ్రీరాంనగర్, ఎస్పీఆర్ హిల్స్‌లోని కొన్ని ఏరియాలు వస్తాయని తెలిపారు.