జూబ్లీహిల్స్,ఫిబ్రవరి13: ఐదేండ్లలోపు పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు ఇచ్చేందుకు చేపడుతున్న ‘మిషన్ ఇంద్రధనుష్’ సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. సమయానుకూలంగా వ్యాధి నిరోధక టీకాలు వేసుకోలేని పిల్లలకు ఎంఐ కార్యక్రమంలో టీకాలు ఇస్తారు. నవజాత శిశువు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 0-5 ఏండ్లలోపు పిల్లలకు ఈ టీకాలు ఇస్తుంటారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల్లో అవగాహన లోపంతో ఈ టీకాలు వేయించకుండా అలసత్వం వహిస్తే పిల్లలు భవిష్యత్‌లో వివిధ అనారోగ్యాలకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు. ఐదేండ్లలోపు పిల్లలందరికీ ఈ టీకాలను వేయించేందుకు వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఇందులో భాగంగా శ్రీరాంనగర్ క్లస్టర్ పరిధిలోని పీహెచ్సీ ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లతో కలిసి మిషన్ ఇంద్రధనుష్ సర్వే చేపడుతున్నారు. యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావునగర్ డివిజన్లలో జూబ్లీహిల్స్, శ్రీరాంనగర్, బోరబండ, వినాయక్‌నగర్ పీహెచ్‌సీల ఆధ్వర్యంలో సర్వే చేపట్టామని ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ తెలిపారు.