బంజారాహిల్స్,ఫిబ్రవరి 12: పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో.. ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా ప్రస్థానం పనులు వడివడిగా సాగుతున్నాయి. రూ.3కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు మూడేళ్ల క్రితమే సుమారు 70శాతం పూర్తయ్యాయి. అయితే స్థానికంగా ధోబీఘాట్ బస్తీవాసుల అభ్యంతరాలు, రోడ్డు సమస్యలతో పనులు పూర్తి కాలేదు. ఇటీవలే అడ్డంకులు తొలగిపోవడంతో పదిరోజుల నుంచి పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.ఎంతో కాలంగా పనులు మహా ప్రస్థానంలో ముందుకు సాగడం లేదంటూ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదులు అందడంతో ఈ పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. గత పదిహేనురోజులుగా పంజాగుట్టలో మహాప్రస్థానం నిర్మాణం పనులను తిరిగి ప్రారంభించారు.
ఆధునిక హంగులతో సిద్ధ్దం
పంజాగుట్టలో ప్రస్తుతం ఉన్న హిందూ శ్మశాన వాటిక వెనక భాగంలో అత్యాధునిక హంగులతో ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనులు చేస్తున్నారు. నాలుగు దహనవాటికలో పాటు విద్యుత్ దహన వాటికను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు అస్థికలు భద్రపరిచే లాకర్లు, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అంత్యక్రియలకు వచ్చేవారు కూర్చునేందుకు వీలుగా గ్యాలరీల నిర్మాణం చేపట్టారు. వీటితో పాటు బాత్రూమ్లు, స్నానాల గదులు, తాగునీటి వసతితో పాటు కెఫెటేరియాను ఏర్పాటు చేయనున్నారు. శ్మశానవాటికలో పచ్చదనం పెంచడంతో పాటు ఆకర్షణీయమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ మార్చి నెలాఖరుకు పూర్తిచేసి మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మార్చిలో పనులు పూర్తి చేస్తాం
పంజాగుట్ట శ్మశానవాటికలో అత్యాధునిక రీతిలో ఫీనిక్స్ ఫౌండేషన్ నిర్మిస్తున్న మహా ప్రస్థానం పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. జీహెచ్ఎంసీ తరపున ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ధోబీఘాట్ బస్తీ వాసుల కోరిక మేరకు ప్రత్యామ్నాయంగా రోడ్డు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటు చిన్న చిన్న సివిల్ వర్క్స్ కూడా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో త్వరలోనే పూర్తిచేస్తాం. మార్చి నెలాఖరులోగా అన్ని పనులు పూర్తి చేస్తాం.