సికింద్రాబాద్/బేగంపేట్, ఫిబ్రవరి 12 : కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం సహకరించకపోగా, రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దుయ్యబట్టారు. ఈ మేరకు శనివారం సనత్‌నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోగల పికెట్నాలాపై రసూల్‌పురా జంక్షన్ వద్ద రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఆధునీకరణ పనులకు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సనత్‌నగర్ నియోజకవర్గంలోని బేగంపేట్ డివిజన్లో రూ. 61 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బేగంపేట్ పాటిగడ్డలో రూ.6 కోట్లతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగ రూ.45 కోట్లతో చేపట్టనున్న బేగంపేట్ నాలా అభివృద్ధి పనులను మయూరిమార్గ్ అల్లంతోటబావి, బ్రాహ్మణవాడిలలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం సహకరించకపోయినా కంటోన్మెంట్ బోర్డు సభ్యుల కోరిక మేరకు 20 వేల లీటర్ల తాగు నీరు ఉచితంగా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు చెప్పారు. డిఫెన్స్ భూమి, నివాసస్థలాల కోసం 20 వేల మందికి పంపిణీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రం ఇవ్వడం లేదన్నారు. ఇచ్చిన భూమికి తిరిగి భూమి ఇస్తామని చెప్పినా, పేదలకు పట్టాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతుందని ఆక్షేపించారు. వీటితో పాటు కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవే నిర్మాణాలకు ల్యాండ్ ఇవ్వాలని కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. కంటోన్మెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మరోసారి కోరుతున్నామని, ఇప్పటికే వంద సార్లు విన్నవించినా కేంద్రం స్పందించడం లేదన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మీ, కుర్మ హేమలతా, మాజీ కార్పొరేటర్ తరుణి, అరుణగౌడ్, శేషుకుమారి, ఆకుల రూప, కోషికే కిరణ్మయి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, ప్రభాకర్, నేతలు టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, లతామహేందర్, పిట్ల నగేష్, దేవులపల్లి శ్రీనివాస్, మహంకాళి శర్విన్, సురేశ్, విజయ్, సంపత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మయూరిమార్గ్ నాలా అభివృద్ధికి రూ.45 కోట్లు
కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట్ డివిజన్లోని నాలా అభివృద్ధికి రూ. 45 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. వర్షం వస్తే ఈ ప్రాంత ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారంగా మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.