సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / అమీర్‌పేట్ : హైదరాబాద్ నగరంలో ఉన్న రైల్వే క్రాసింగ్‌లపై చేపట్టాల్సిన నిర్మాణాలపై ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో శనివారం నగరంలో చేపట్టాల్సిన రైల్వే అండర్ పాస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఇతర రైల్వే శాఖ సంబంధిత పెండింగ్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ఎస్ఆర్డీపీ వంటి అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జీహెచ్ఎంసీ రోడ్ల వసతుల కల్పనతో సమన్వయం చేసుకొని రైల్వే శాఖ కూడా ఆర్యూబీ, ఆర్వోబీల నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇస్తే ఈ ట్రాఫిక్ రద్దీ మరింత తగ్గించవచ్చని అన్నారు. ఈ దిశగా రైల్వే శాఖ, జీహెచ్ఎంసీ కలిసి సమన్వయం పని చేయాలన్నారు. ఇందుకు స్పందించిన దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీకి తాము సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. సాధ్యమైనంత తొందరగా రైల్వే శాఖ అనుబంధ మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్‌కు బుక్లెట్ అందించిన మేయర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేయర్ మిత్రమండలి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ చేపట్టిన పలు కార్యక్రమాలపై బుక్లెట్ రూపొందించారు. ఈ బుక్‌లెట్‌ను బుద్ధభవన్‌లో శనివారం మంత్రి కేటీఆర్‌కు మేయర్ గద్వాల విజయలక్ష్మీ అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి ఉన్నారు.