వ్యవసాయ యూనివర్సిటీ , ఫిబ్రవరి 12: తెలంగాణలోని నేలలు, వాతావరణ పరిస్థితులు ద్రాక్షసాగుకు అనుకూలంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సాగు, అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తుందని ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజేంద్ర నగర్ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, కళాశాల ఆడిటోరియంలో వైస్ చాన్స్లర్ నీరజా ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం ద్రాక్ష సాగుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని 32 జిల్లా కేంద్రాలకు సమీపంలో ద్రాక్ష తోటలు పెంచేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, రైతు చింతల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 1999 నుంచి 2013 మధ్య కాలంలో వర్షాలు సకాలంలో పడక పోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ద్రాక్ష తోటలన్నీ రియల్ భూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం, వ్యవసాయం, అనుబంధ రంగాలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా.భగవాన్, మాజీ వీసీ డా. షిఖామణి, ఐసీఎఆర్ డైరెక్టర్ డా. సోమ్క్వార్, నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంతానం, ఐసీఏఆర్ పూణె ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డా.సుజయ్ సహా, రీసెర్చ్ హెడ్ డా.విజయ పాల్గొని పలు సూచనలు చేశారు.