సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఉత్తమ వైద్యసేవలు అందించే రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిందని, మరికొంత కష్టపడితే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రూ.11కోట్లతో నిర్మించనున్న ఓపి బ్లాక్, డయాలసిస్ సెంటర్ పనులకు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. 13 పార్థీవ వాహనాలు, మూడు అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఫీవర్ హాస్పిటల్ 1915లో క్వారంటైన్ సెంటర్‌గా ప్రారంభమై కాలక్రమేణా కోరంటిగా మారిందన్నారు. సీజనల్ వ్యాధులు వచ్చినపుడు ఇక్కడ ఓపీ రోగుల సంఖ్య 2000వరకు ఉంటుందన్నారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకే ఇక్కడ రూ.11కోట్లతో నూతన ఓపీ బ్లాక్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.
ఫీవర్ హాస్పిటల్‌కు 13 పార్థీవ వాహనాలు, 3 అంబులెన్స్‌లను సమకూర్చిన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 61దవాఖానల్లో మార్చురీల ఆధునీకరణకు రూ.32.54కోట్లు విడుదల చేశామని, దేశంలోనే బెస్ట్ మార్చురీలను అధ్యయనం చేసి రూ.9 కోట్లతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫీవర్ హాస్పిటల్లో మార్చురీ అభివృద్ధికి రూ.60లక్షలు, డయాలసిస్ కేంద్రానికి రూ.50లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. నగరం నలువైపులా నాలుగు సూపర్‌స్పెషాల్టీ హాస్పిటళ్లు నిర్మించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అదేవిధంగా స్టాఫ్ నర్స్, డాక్టర్స్ రిక్రూట్మెంట్కు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.