రంగారెడ్డి, ఫిబ్రవరి 12, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో నాలాల అభివృద్ధికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో వరద నీటి సమస్యను తీర్చేందుకు ఎస్ఎన్డీపీ కింద రూ.194 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. మంత్రి కేటీఆర్ దృష్టికి ఇటీవల వరద ముంపు సమస్యను తీసుకెళ్లగా, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని
ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గంలో రూ.89 కోట్లతో నాలాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదించామన్నారు. వీటిలో రూ.60 కోట్లతో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు పనులు ప్రతిపాదించామని, రూ.29 కోట్లతో బాలాపూర్ పెద్ద చెరువు నుంచి కొత్తమోనికుంట వరకు, బురాన్‌ఖాన్ చెరువు నుంచి పెద్ద చెరువు వరకు నాలాల ఏర్పాటుకు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. రూ.105కోట్ల నిధులతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. మాసాబ్ చెరువు నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల మీదుగా దిల్‌వార్‌ఖాన్ చెరువు, సూర్యవంశీ గార్డెన్, ఇదుల చెరువు, ఓఆర్ఆర్ వరకు వరద నీటి సమస్యను తీర్చేందుకు నాలాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.