సిటీబ్యూరో, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): పోలీసు అధికారుల ఎత్తులకు పై ఎత్తు వేస్తూ దొంగతనం, చోరీలకు పాల్పడేవారు అత్యాధునిక సాంకేతికతను ఎంత సునాయాసంగా వాడుతున్నారో తెలుసుకోవడానికి కార్ల దొంగ ‘నూతన్ కుమార్’ ఘటనలే నిదర్శనం. పోలీసులను గందరగోళానికి గురి చేసేందుకు కార్లకు ఉండే జీపీఎస్‌లను గుంతలు, ఇతర రాష్ర్టాల లారీలలో పడేస్తుంటాడు. ఇలా సాంకేతికంగా ఆధారపడే పోలీసులకు జీపీఎస్ పోజీషనింగ్ లొకేషన్ ఒక చోట, చోరీ చేసిన కారుతో నూతన్ కుమార్ మరో ప్రదేశంలో దర్జాగా తిరుగుతుంటాడు. పోలీసులు అతని చేరుకునే లోపే ఆ కారును అమ్మేసి వచ్చిన డబ్బుతో జల్సాలు కూడా చేసేస్తుంటాడని రాచకొండ పోలీసుల విచారణలో తెలిసింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ భీమవరం మండలం చిన్న అమ్మిరాం గ్రామానికి చెందిన నూతన్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు అనుచరులను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.
యాక్సిడెంట్ల వాహనాల నెంబర్లు..
నూతన్ కుమార్ ఆన్లైన్లో పలు అద్దెకు ఇచ్చే హై ఎండ్ కారులను తీసుకుని ఉడాయిస్తుంటాడు. ఈ సమయంలో అతను ఉడాయించిన కారుకు యాక్సిడెంట్ కారుల నెంబర్లను పెట్టి వాటిని అమ్మేస్తుంటాడు. ఎవరు అనుమానించకుండా ఆ నెంబరు ప్లేట్లను పెట్టుకుని తిరుగుతుంటాడు. దీని కోసం అతను చోరీ చేసిన కార్లలో లాంగ్ డ్రైవ్‌లు చేసే సమయంలో రోడ్లపై జరిగే యాక్సిడెంట్ వాహనాల నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్లను తాను తస్కరించిన కారులకు తగిలించుకుని తిరుగుతుంటాడు. మరి కొన్ని సందర్భాలలో కారును అమ్మేందుకు వెళ్ళినప్పుడు గ్యారెజ్లలో స్క్రాప్‌లుగా మిగిలిపోయే వాహనాల నెంబర్లను సేకరించుకుని వాటిని తగిలించుకుంటాడు. అందులో తాను దొంగతనం చేసుకోబోతున్న కారు మోడళ్ల నెంబర్లనే సేకరిస్తాడు. కొన్ని సందర్భాల్లో నెంబరు ప్లేట్లను ముందుగా తయారు చేసుకుని పెట్టుకుంటాడు.
విమానంలో చక్కర్లు…
నూతన్‌కుమార్ కారులను చోరీ చేసేందుకు ఇతర రాష్ర్టాలకు వెళ్ళేందుకు అధికంగా విమానంలో ప్రయాణిస్తాడు. విమానంలో ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ హోటళ్లలో గదిని అద్దెకు తీసుకుని ఉంటాడు. ఆ గది నుంచే ఆన్లైన్లో అద్దెకు ఇచ్చే పలు సంస్థల నుంచి కారును బుక్ చేసుకుని వాటిని తన దగ్గరకు తెప్పించుకుని వాటితో ఉడాయిస్తాడు. అలా కారు రాగానే కొద్ది దూరం ప్రయాణించి అందులో ఉండే జీపీఎస్ ట్రాకర్‌ను పీకేసి వాటిని గుంతలు, లేదా ఇతర వాహనాల్లో పడేస్తాడు. బుకింగ్ సమయంలో నమోదు చేసిన ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్‌గా పెట్టేస్తాడు. ఇలా నూతన్‌కుమార్ రూట్ డైవర్షన్ పెట్టి తన దగ్గరికి పోలీసులు చేరుకునే లోపే ఆ ఖరీదైన కార్లను అమ్మేసి మస్తుగా ఎంజాయ్ చేసేస్తాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
యాప్‌లోనే ఛేంజ్…
నూతన్ కుమార్ తనకు తెలిసిన వారు ధ్రువీకరణ పత్రాలను చోరీ చేసి వాటిని దగ్గర పెట్టుకుంటాడు. కారు చోరీలకు ఇతర రాష్ర్టాలకు వెళ్ళినప్పుడు అతను ముందుగా ఓ యాప్ ద్వారా తెలుగు రాష్ర్టాల చిరునామాలను వారి భాషలోకి మారుస్తాడు. అలా అన్నింటిని ఛేంజ్ చేసిన తర్వాత వాటిని కలర్ జిరాక్స్ తీసి వాటితో ఆన్లైన్లో కారులను బుక్ చేస్తాడని స్పష్టమైంది. చైతన్యపురి పరిధిలో జరిగిన ఇన్నోవా క్రిస్టా కారు చోరీ కేసు దర్యాప్తులో పోలీసులకు జీపీఎస్ ట్రాక్ర్ విజయవాడ లొకేషన్ చూపించగా నూతన్ కుమార్ మాత్రం మరో జిల్లాలో ఉంటూ హాయిగా తిరిగి వాహనాన్ని అమ్మేసినట్లు సమాచారం. పోలీసులు జీపీఎస్ ట్రాకర్‌ను వెదుకుతూ వెళ్ళగా ఆ కారు జీపీఎస్ పోలీసులకు ఓ గుంతలో దొరికింది.