ఎర్రగడ్డ, ఫిబ్రవరి 12: డ్రగ్ రహిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కృషి చేస్తున్నారని, ఈ విషయంలో ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాల కట్టడికి నడుం బిగించాలని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నగర పోలీస్ ఆధ్వర్యంలో శనివారం బోరబండలో ‘డ్రగ్ అవేర్నెస్’ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మహమూద్ అలీ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో డ్రగ్స్ నివారణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశమై తీసుకోవాల్సిన చర్యల గురించి స్పష్టమైన ఆదేశాలిచ్చారని వివరించారు.
ఇందులో భాగంగా ఇటీవల ‘నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్’ విభాగాన్ని నెలకొల్పటం జరిగిందని పేర్కొన్నారు. నగరంలో గంజాయి కల్చర్ చాప కింద నీరులా ఎక్కడ పడితే అక్కడ లభించటం విచారకరమైన విషయమని సీవీ ఆనంద్ అన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌లు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన ఎందరో యువకుల్లో పోలీసుల కౌన్సెలింగ్ ద్వారా ఎంతో మార్పు వచ్చిందన్నారు. డ్రగ్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ఆడియో సీడీ, వీడియోను మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు.
దేశంలోనే నంబర్ వన్…
దేశంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదిగిన పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం సొంతమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆధునికీకరించిన బోరబండ పోలీస్ ఔట్ పోస్టును ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌లతో కలిసి ప్రారంభించారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్నదని పేర్కొన్నారు. త్వరలో బోరబండ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కానుందని సీపీ ఆనంద్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సహాయ కమిషనర్ చౌహాన్, డీసీపీ జోయల్ డేవిస్, ఇన్చార్జి ఏసీపీ సుదర్శన్, ఎస్సార్‌నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులు, వివిధ ఠాణాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.