ఉప్పల్, ఫిబ్రవరి 12: కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వ్యక్తులను ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ కథనం ప్రకారం, విశ్వసనీయ సమాచారం అందడంతో ఉప్పల్ ప్రధాన రహదారిలో శనివారం నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉప్పల్ ప్రధాన రహదారిలో నలుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చి గంజాయి ప్యాకెట్లు సరఫరా చేయడం పోలీసులు గుర్తించారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు పారిపోయే ప్రయత్నం చేశారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ధూల్‌పేట నుంచి రూ.2 వేలకు బాటిల్‌ను తీసుకువచ్చి, ఈ ప్రాంతంలో రూ.3 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వాటిని ప్యాకెట్లుగా చేసి అధిక రేట్లకు హబ్సిగూడ, నాగోల్, ఉప్పల్ ప్రాంతాలలో విద్యార్థులకు, యువకులకు విక్రయిస్తున్నారు. అయితే, పోలీసుల అదుపులో విజయపురి కాలనీకి చెందిన బాల్ఘాట్ దివేష్(20), వనస్థలిపురం – వంగపాటి చంద్రశేఖర్(21), మన్సూరాబాద్- ఆదిత్యసింగ్(21), సాయిరాజ్(21)లుగా గుర్తించారు. వారి పై పోలీసులు కేసు నమోదు చేసి, వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. యువకులను రిమాండ్‌కు తరలించారు.