శేరి లింగంపల్లి, ఫిబ్రవరి 12: యువత విజ్ఞానవంతులైనపుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద అన్నారు. గచ్చిబౌలిలోని టీహబ్‌లో తెలంగాణ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన నాలెడ్జి వీక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలెడ్జి వీక్‌లో భాగంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, అధాత్మిక, రక్షణ, వ్యవసాయం, స్టార్టప్, టెక్నాలజీ వంటి వివిధ రంగాల్లో చర్చాగోష్టిలు నిర్వహించడం అభినందనీయమన్నారు. లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామి శితికాంతానంద, టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ కుమార్, పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇన్నోవేషన్లకు కేంద్రంగా టీ హబ్
తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా ఉన్న టీ హబ్‌ను పోలాండ్ కాన్సులేట్ జనరల్ ఇన్ ముంబయి డామియిన్ ఇర్జిక్ సందర్శించారు. శనివారం గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న టీ హబ్‌ను అక్కడి సీఈఓ ఎం.ఎస్.రావుతో కలిసి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. ప్రధానంగా స్టార్టప్‌ల కోసం ఉన్న కెపాసిటీ బిల్డింగ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫండింగ్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, మెంటార్, సప్లయర్ నెట్వర్క్, ఎకో సిస్టం పార్టనర్స్ వంటి విషయాలను టీ హబ్ నిర్వాహకులు వివరించారు. దీనిపై పోలాండ్ కాన్సులేట్ జనరల్ ఇన్ ముంబయి డామియిన్ ఇర్జిక్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ అభివృద్ధికి ఇన్నోవేషన్ ఎంతో కీలకం. అలాంటి ఇన్నోవేషన్లకు కేంద్రంగా టీ హబ్ ఉందని, అలాంటి ప్రాంతాన్ని సందర్శించడం, వారితో చర్చలు జరపడం చాలా గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. ఇప్పటి వరకు టీ హబ్‌ను వివిధ దేశాలకు చెం దిన కాన్సులేట్ జనరల్స్ సందర్శించారని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు.