సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 10 : సమ్మక్క-సారలమ్మలకు మొక్కు బంగారం(బెల్లం) చెల్లించుకోలేని భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం ఎంజీబీఎస్ కస్టమర్ రిలేషన్ మేనేజర్ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కార్గో పార్సిల్ ద్వారా మొక్కులు చెల్లించేందుకు అవకాశం కల్పించామని ‘బంగారం పంపించడం మీ వంతు..అమ్మవార్లకు సమర్పించడం మా వంతు’ అనే నినాదంతో ఆర్టీసీ ఈ సేవలను ప్రారంభించిందన్నారు.
భక్తులు బంగారం(బెల్లం)5 కేజీల వరకు అందజేయవచ్చని.. రూ. 450 చార్జీ ఉంటుందని, ఎంజీబీఎస్ ఫ్లాట్ ఫాం-19లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్సిల్ కౌంటర్లో ఈ నెల 11 నుంచి 17 వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. కార్గోలో బుక్ చేసిన ప్రతి భక్తుడికి మేడారం జాతర ముగింపు అనంతరం అమ్మవార్ల ప్రసాదం, (200 గ్రాములు), ఫొటో, పసుపు, కుంకుమను పార్సిల్ కౌంటర్ వద్ద అందజేస్తామన్నారు.