పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ద్వేషి అంటూ గ్రేటర్లో నిరసనలు పెల్లుబికాయి. ఉద్యోగులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు… నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతుందంటూ మండిపడ్డారు. ప్రధాని హోదాను మరిచి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరంచేస్తామని హెచ్చరించారు.
ప్రధాని బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
రాజ్యసభ వేదికగా తెలంగాణ ప్రజలను అవమానించిన ప్రధాని నరేంద్రమోడీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీఎస్‌జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాందాల భాస్కర్ మాట్లాడుతూ బీజీపీ కార్యాలయాలను అన్ని జిల్లాల్లో ముట్టడించాలని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుని తమ నిరసన తెలపాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. టీఎస్‌జేఏసీ, ఓయూజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల పునరేకీకరణ చేస్తామని, బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌జేఏసీ, ఓయూజేఏసీ, గిరిజన విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఎస్జే, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్, ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, క్రిస్టియన్ స్టూడెంట్ అసోసియేషన్ తదితర సంఘాల నాయకులు రవీంద్రనాయక్, అశోక్‌యాదవ్, అంగరి ప్రదీప్, హబీబ్ ఖాద్రీ, ప్రణయ్, చిక్కుడు వెంకట్, శరద్‌యాదవ్, శ్రవణ్‌యాదవ్, కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్‌బజార్: నారాయణగూడలోని ఐపీఎంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్, భాగ్యనగర్ తెలంగాణ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ, బీటీఎన్జీవో నాయకులు జి మల్లారెడ్డి, ఎస్ ప్రభాకర్‌రెడ్డి, ఏ శ్రీనివాస్, జి రాజేశ్వర్‌రావు, ఎం శ్రీనివాస్‌రావు, అబ్దుల్ సాధిక్, ఎస్ సంధ్యారాణి, రషీదా బేగం తదితరులు
హైదరాబాద్ జిల్లా టీజీవో సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన తెలుపుతున్న టీజీవో సీఏ ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, టీజీవో నాయకులు ఎంబి కృష్ణ యాదవ్, కలెక్టరేట్ సిబ్బంది కిశోర్, ఆనంద్, రాయుడు, బాబురావు, తదితరులు