సిటీబ్యూరో, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): రోజురోజుకూ జీవన విధానంలో ఆధునీకరణ పెరుగుతున్న కొద్దీ, అందుకు తగ్గట్టే నేరాలు కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లాంటి విశ్వ నగరంలో నేరగాళ్లు హై టెక్నాలజీతో మోసాలకు పాల్పడుతున్నారు.దేశంలో సైబర్ బ్యాగ్రౌండ్‌తో పలువురు నేరస్థులు జనాల్ని దోచుకుంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశంలో నాల్గో స్థానంలో ఉండగా, నేరస్థులకు శిక్షలు అమలు చేసే విషయంలో మాత్రం ద్వితీయ స్థానంలో నిలిచింది.
శిక్షలూ పెరుగుతున్నాయ్..
సైబర్ నేరాలు ఏయేటికాయేడు పెరుగుతూ పోతున్నాయి. అదే విధంగా నేరస్థులకు శిక్షలు కూడా ఎప్పటికప్పుడు పడుతున్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి బుధవారం వెల్లడించారు. 2018 నుంచి 2020 వరకు భారీగా సైబర్ నేరాలు పెరిగాయని, అదే స్థాయిలో అత్యధికంగా శిక్షలు పడ్డ రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్ తరువాత, తెలంగాణ ఉందని వివరించారు. 2018లో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో శిక్షలు పడలేదని 2020లో 282 మందికి శిక్షలు పడ్డాయి. సైబర్ నేరాలు 317 శాతం పెరిగాయి. సైబర్ నేరాల నమోదులో ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తరువాత నాల్గో స్థానంలో తెలంగాణ ఉందని, అయితే, నేరస్థులకు శిక్షలు పడటంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి ప్రకటించారు.
కేసుల దర్యాప్తులో ఫస్ట్..
సైబర్ నేరాలలో బాధితులు మనవాైళ్లెతే నిందితులు ఇతర రాష్ర్టాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో కేంద్రం నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చి, ఏదైనా సైబర్ మోసం జరగగానే వెంటనే ఫిర్యాదు చేయాలంటూ టోల్ ఫ్రీ నంబర్ (155260)ను అందుబాటులోకి తెచ్చింది. ఘటన జరిగిన 24 గంటల్లో వేగంగా బాధితులు స్పందించి ఫోన్ చేసినా, పోర్టల్‌లో ఫిర్యాదు చేసినా పోయిన డబ్బులు వచ్చేందుకు అవకాశముంటుంది. సైబర్ నేరగాళ్ల ఖాతాలలో నుంచి ఇతర ఖాతాలకు బదిలీ అవుతున్న క్రమంలో వాటిని గుర్తించి ఖాతాలలో నిలిపివేసేందుకు అవకాశముంటుంది. అన్ని బ్యాంకులతో ఈ పోర్టల్‌కు అనుంధానమై ఉండటంతో సైబర్ నేరగాళ్లకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభించేందుకు వెంటనే అవకాశాలుంటాయి.
ఇందు లో భాగంగా తెలంగాణ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చిందంటే వెంటనే నేషనల్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. అయితే, కేసుల నమోదుకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర రాష్ర్టాలకు భిన్నంగా ప్రతి సైబర్ నేరంపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేరగాళ్లు ఏ రాష్ట్రంలో ఉన్నా అక్కడకు వెళ్లి పట్టుకొస్తున్నారు. ఇలా సైబర్ నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు మొదటి వరసలో ఉంటారని, ఇతర రాష్ర్టాల పోలీసులూ పేర్కొంటున్నారు. అందులో ట్రై కమిషనరేట్ల సైబర్ క్రైమ్ విభాగాలు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.