ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 10: ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆధ్వర్యంలో యూత్ కల్చరల్ ఫెస్ట్ ‘డుసిమస్-2022’ గురువారం ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెస్ట్‌లో భాగంగా మొదటిరోజు ‘రంగోలి, వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీ’ విభాగాల్లో పోటీలు జరిగాయి. శుక్రవారం ‘సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, స్టాండప్ కామెడీ’ తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్‌కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు, నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. పన్నెండేండ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం.
ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. ఫెస్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జార్జిరెడ్డి సినిమా దర్శకుడు జీవన్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక, ప్రొ.జీబీ రెడ్డి, డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ పంతు నాయక్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాంప్రసాద్, నిర్వాహకులు వెంకటేశ్, రితీశ్, ప్రశాంత్, గోపాల్ పాల్గొన్నారు.