మెహిదీపట్నం/ బంజారాహిల్స్ ఫిబ్రవరి 10: నగరంలో ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. పోలీసులకు దొరకకుండా హంగామా స్పష్టించాడు. వైద్యశాలలో చొరబడి..రోగి పీకపై కత్తిపెట్టి… తప్పించుకునేందుకు యత్నించాడు. అతడిని వెంబడిస్తూ.. వస్తున్న పోలీసులు ..నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బజార్‌ఘాట్‌లో నివసించే ఖాజాఫరీదుద్దీన్ ఖాద్రి(27) అలియాస్ మెంటల్ ఫరీద్ రౌడీషీటర్. ఇతడి సోదరుడు బషీర్ డిసెంబర్ 31న వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
తన తమ్ముడి మృతికి స్నేహితులే కారణమంటూ.. వారికి తరచూ ఫోన్లు చేసి.. డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు ఖాజాఫరీదుద్దీన్. ఫిర్యాదు అందుకున్న గోల్కొండ పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో బుధవారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పరిధిలోని సయ్యద్‌నగర్‌లో ఉన్నాడని సమాచారం అందడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసుల రాకను గమనించిన ఫరీద్..పారిపోయే ప్రయత్నంలో చోరీ చేసిన కారుతో వేగంగా పెట్రోలింగ్ కారును ఢీకొట్టాడు. ఆ తర్వాత కారును వదిలి.. రోడ్డుపై పరుగులు తీశాడు. కొంతదూరం వెళ్లాక షేక్ అల్ఫాస్ అనే వ్యక్తిని అడ్డుకుని కత్తితో బెదిరించి.. స్కూటర్‌ను లాక్కుని పరారయ్యాడు. హకీంపేట్ వైపు పారిపోతుండగా, గోల్కొండ పోలీసులు వెంబడించారు. టోలీచౌకి చౌరస్తా సమీపంలో ఉన్న యాపిల్ హాస్పిటల్లోకి చొరబడిన నిందితుడు..
ఓ రోగి గొంతుపై కత్తి పెట్టి..హల్చల్ చేశాడు. అక్కడకు చేరుకున్న గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిపై కూడా దాడికి యత్నించాడు. నాటకీయ స్థితిలో అతడిని పట్టుకున్నారు. నిందితుడు మత్తులో ఉన్నాడని, గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా, సయ్యద్‌నగర్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టడం, పోలీసుల విధులను అడ్డుకోవడం, దారిన పోతున్న వ్యక్తిని కత్తితో బెదిరించి.. స్కూటర్‌ను లాక్కున్న ఫరీద్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.