సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మహేశ్ బ్యాంక్ దోపిడీ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. ఈ క్రమంలో గతేడాది నైజీరియాలోని బ్యాంక్‌పై జరిగిన సైబర్ దాడి.. ఇక్కడి బ్యాంక్‌లో దోపిడీ విధానం ఒకేలా ఉందని పోలీసులు గుర్తించారు. నైజీరియన్ బ్యాంక్ సర్వర్‌పై దాడి చేసిన హ్యాకర్లు..రూ. 33.68 కోట్లు(ఎన్1.87 బిలియన్) దోచేశారు. హ్యాకింగ్ విషయం తెలుసుకొని.. అక్కడి దర్యాప్తు సంస్థలు రూ. 7.5 కోట్లు(ఎన్ 417.5 మిలియన్లు) ఖాతాల్లో ఫ్రీజ్ చేశాయి. సూత్రధారుల్లో ఒకడైన సాలు అబ్దుల్మాలిక్ ఫెమిని అరెస్ట్ చేశారు.
అక్కడ కూడా రెండు నెలల నుంచి స్కెచ్ వేసిన సైబర్‌నేరగాళ్లు.. నైజీరియన్ బ్యాంక్‌లోని మూడు ఖాతాలకు ఎన్1.87 బిలియన్లు బదిలీ చేసి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్‌పై హ్యాకర్లు గత నెల 22వ తేదీన దాడి చేసి.. రూ. 12.93 కోట్లు కొట్టేశారు. ఆ డబ్బును బ్యాంక్‌లోని నాలుగు ఖాతాలకు బదిలీ చేసి, అక్కడి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న 128 అకౌంట్లలోకి బదిలీ చేశారు. రూ. 3 కోట్లు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేశారు.
ఈ రెండు బ్యాంకు దోపిడీ ఘటనలు ఒకే తరహాలో ఉండడంతో పాటు హ్యాకింగ్ వెనుక నైజీరియన్లే కీలక సూత్రధారులుగా ఉన్నారు. కాగా, మహేశ్ బ్యాంక్ సైబర్ దోపిడీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా చేపట్టిన పోలీసులు.. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలపై విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే నైజీరియన్ బ్యాంక్ సైబర్ దోపిడీ అంశం దృష్టికి వచ్చింది. అయితే నైజీరియా నుంచి మహేశ్ బ్యాంక్ సర్వర్‌పై దాడి జరిగిందా? అక్కడి ముఠా దేశంలో ఉన్న నైజీరియన్లను మధ్యవర్తులుగా నియమించి ఖాతాలు తెరిపించారా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
అత్యాచారం నిందితులకు జీవితఖైదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): మద్యం తాగించి.. మైకంలో ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు రంగారెడ్డి జిల్లా మహిళా వేధింపుల నిరోధక న్యాయస్థానం జీవిత ఖైదు, ఒక్కొక్కరికీ 5వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుచ్చిరెడ్డి కథనం ప్రకారం…2019, డిసెంబర్ 17 ఘటన జరుగగా, కేసును దర్యాప్తు చేసిన మల్కాజిగిరి పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. వారిపై చార్జీషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. నిందితులైన ఆంటోని జార్జ్, నేనావత్ విజయ్ కుమార్‌లకు జీవిత ఖైదు, జరిమానా విధించింది.