సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : నగరంలో మౌలిక సదుపాయాలు, సుందరీకరణ, రహదారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్ఎంసీ పాలకమండలి ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ మేయర్‌గా మొదటి ఏడాది సేవలు సంతృప్తినిచ్చాయని తెలిపారు.సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ లోకేశ్ కుమార్, అధికారులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి పనులపై రూపొందించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధిపై ఆమె ఏమన్నారంటే..
709 కిలోమీటర్ల రోడ్డు..
రహదారుల నిర్వహణలో రాజీ లేకుండా పనిచేస్తున్నాం. సీఆర్ఎంపీ ద్వారా 709 కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 468 కిలోమీటర్లు పూర్తి చేశాం. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని 90 కూడళ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇప్పటి వరకు 69 జంక్షన్లను అభివృద్ధి చేశాం. పాదచారుల సౌకర్యార్థం రూ. 128 కోట్లతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టి, నాలుగు బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు.
900 కాలనీల్లో పార్కులు..
నగరంలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాం. 2021లో హరితహారం కింద 1.23 కోట్ల మొకలను నాటడంతో పాటు పంపిణీ కూడా చేశాం. బల్దియా పరిధిలో 4846 కాలనీలు ఉండగా, 900 కాలనీల్లో పారులు అభివృద్ధి చేశాం.
111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు..
జీహెచ్ఎంసీ పరిధిలోని 111 ప్రాంతాల్లో లక్ష ఇండ్లను నిర్మించాలన్న లక్ష్యంగా ఇప్పటివరకు 65 వేల గృహాలను నిర్మించాం. కొల్లూరు -2 హౌజింగ్ ప్రాజెక్ట్‌లో 117 బ్లాక్‌లలో 15,600 గృహాలను నిర్మించాం.
256 బస్తీ దవాఖానలు..
నగరంలో 350 బస్తీ దవాఖానలు లక్ష్యంగా..ఇప్పటి వరకు 256 ఏర్పాటు చేశాం. డ్రైవర్ కం.. ఓనర్ పథకం ద్వారా 4500 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేశాం. కొవిడ్ నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాం. ఫీవర్ సర్వే, కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ నిర్వహించాం. లాక్డౌన్ సమయంలో వీధి వ్యాపారులను ఆదుకున్నాం.
మే నాటికల్లా ఎస్ఆర్డీపీ మొదటి దశ పూర్తి..
సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఫె్లైఓవర్లు, అండర్ పాస్‌లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, లింక్, మిస్సింగ్ రోడ్ల నిర్మాణం భారీ ఎత్తున చేపట్టాం. బాలానగర్, అబ్దుల్ కలామ్ ఫె్లైఓవర్, షేక్‌పేట్ ఫె్లైఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వచ్చే మార్చి నాటికి తుకారాంగేట్ రైల్వే గేట్, ఎల్బీనగర్ కుడివైపు అండర్ పాస్‌లు, బహదూర్‌పుర ఫె్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయి. ఎస్ఎన్డీపీ ద్వారా నాలాల అభివృద్ధికి మొదటి దశలో రూ. 858 కోట్లతో 52 పనులను ప్రతిపాదించాం. అందులో 32 పనులకు టెండర్లు పిలిచి, 17 పనులు కూడా ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
అందరి సమన్వయంతో అభివృద్ధి
నగరంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నో రహదారులు అభివృద్ధి చేశాం.
– మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, డిప్యూటీ మేయర్