అబిడ్స్, ఫిబ్రవరి 10: గతనెలలో ప్రారంభమై, కరోనా నేపథ్యంలో రద్దయిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను తిరిగి ఈనెల 25 నుంచి నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ కసరత్తు చేస్తున్నది. ఈమేరకు సొసైటీ మేనేజింగ్ కమిటీ సమావేశమై తిరిగి అనుమతులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నది. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు నిర్వహిస్తారు. గతేడాది కొవిడ్ నిబంధనలతో నుమాయిష్ నిర్వహించలేదు.
ఈ ఏడాది అన్ని అనుమతులు లభించడంతో జనవరి 1న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. అయితే, కొవిడ్ నిబంధనలు, ప్రభుత్వం ఆదేశాల మేరకు రెండో తేదీన ఎగ్జిబిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు సొసైటీ ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఈనెల 25వ తేదీ నుంచి నుమాయిష్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు నగర పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. శుక్రవారం అనుమతి మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.