సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం నాటికల్లా వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద రూ.12.86 కోట్లతో చేపట్టనున్న నాలా అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. జూబ్లీహిల్స్, కూకట్పల్లి, సనత్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని ఏజీ కాలనీ నుంచి సనత్‌నగర్ నాలా వరకు 2,423 మీటర్లు ఉండగా, ఇందులో మొదటి విడతలో 830 మీటర్ల నాలా అభివృద్ధి పనులకు రూ.12.36 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో నాలాకు రిటైనింగ్ వాల్స్, బాక్స్ డ్రైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు పేరొన్నారు. మొదటి విడతలో చేపట్టే నాలా అభివృద్ధి పనులతో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్, ఆనంద్‌నగర్, ప్రేంనగర్, సుల్తాన్‌నగర్, తదితర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఇబ్బంది పడుతున్న వరదనీటి ముంపు సమస్య తీరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ షాహీనా బేగం, సనత్‌నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈ భాసర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.