కొండాపూర్, ఫిబ్రవరి 10: యోగులు, కాలజ్ఞానులు, అవధూతల అందరి లక్ష్యం సమాజ కల్యాణమేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం, తాంబరం చెన్నై ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు, కన్నడ భాషల్లో కాలజ్ఞానులు, అవధూతలు, సిద్ధులు’ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో ఆయన పాల్గొని ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ‘యోగులు, సిద్ధులు, కాలజ్ఞానులు, అవధూతలు’ ఒక మతానికో, ప్రాంతానికో పరిమితం కాదని, అన్ని మతాల్లోనూ ఉన్నారని, వారందరి లక్ష్యం లోక శ్రేయస్సేనని అన్నారు. నిజమైన ప్రేమను పెంపొందించేదే జ్ఞానమని, మానవీయ సంబంధాలు పరిమళించేలా చేయడంలో వారి బోధనలు ఎంతగానో తోడ్పతాయని చెప్పారు. తెలుగు ప్రాంతాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన వంటి మహనీయులు మాత్రమే కాకుండా, కడప జిల్లాలోని కాశీరెడ్డి నాయన, దున్న ఇద్దాసు, కొత్తలంక వలీబాబా, ముమ్మిడివరం బాలయోగి వంటి వారు అన్ని ప్రాంతాల్లో ఉన్నారని తెలిపారు.