ముషీరాబాద్, ఫిబ్రవరి 10: హాస్య రచనల్లో పానుగంటి లక్ష్మీ నర్సింహారావుకు ఎవరు సాటి రారని ఎస్వీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. ఎందరో మహానుభావులు మధుర స్మృతుల కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జయంతి సభ చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొని నరసింహారావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, సున్నిత, హాస్య రచనల్లో పానుగంటి లక్ష్మీ నరసింహారావుకు సాటి మరొకరు లేరని, ఆయన రచనలు నాటి సామాజిక, రాజకీయ వ్యవస్థలపై ఎంతో ప్రభావం చూపాయని తెలిపారు. ఆయన రాసిన నాటకాలు చక్కటి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టాయని కొనియాడారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కవి రఘుశ్రీ, నటుడు మానిక్, భమిడిపాటి ఉష, చరణ్, లతావర్మ పాల్గొన్నారు.