రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. ముందుగా ప్రమాదం ఎందుకు జరిగింది.. అనే అంశంపై వివరాలను సేకరిస్తున్నారు. పలు కోణాల్లో ఘటనాస్థలి వద్ద ఆరా తీస్తున్నారు. వాహనదారుడితో కూడా మాట్లాడుతున్నారు. ఇతర ప్రయాణికుల నుంచి సైతం వివరాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మరణాలు జరిగే స్పాట్లు..తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యానికి గురైన సంఘటనలపై దృష్టి పెడుతున్నారు.
ఇలా కమిషనరేట్ పరిధిలోని హైవే, ప్రధాన రహదారులపై మొత్తం 45 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. వాటిలో 39 చోట్ల ప్రమాద నివారణ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఈ విశ్లేషణలో బ్లాక్ స్పాట్స్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదాలు ఒకటి కూడా చోటు చేసుకోలేదు. గతంలో సుమారు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, లోపాలను సరిచేసిన అనంతరం ‘నో డెత్స్’గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇలా సీపీ మహేశ్ భగవత్ ఆదేశాలతో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేసిన ప్రయత్నం విజయవంతమైంది. వాహనదారులకు రోడ్డు భద్రత కల్పించడంలో రాచకొండ పోలీసులు నం.1గా నిలిచారు.
చిన్న తప్పిదాలతో..
చిన్న తప్పిదాలతో బ్లాక్స్పాట్స్లలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. ట్రాఫిక్ బ్లింకర్స్, మార్కింగ్స్, యూటర్న్ సూచిక బోర్డులు, వీధి దీపాలు, గుంతలు పడ్డ చోట మరమ్మతులు, ప్రమాదాల నివారణ పరికరాలను ఏర్పాటు చేశారు. సమన్వయంతో చర్యలు తీసుకోవడంతో వాహనదారులకు సురక్షితమైన ప్రయాణానికి మార్గం ఏర్పడింది.
ప్రమాదం ఎలా జరిగింది..? ఎప్పుడు జరిగింది..? ఏదైనా అడ్డు వచ్చిందా…? వేగ నియంత్రణ బోర్డులు లేవా.. ? ఇలా వివిధ అంశాలపై విశ్లేషించి.. యాక్సిడెంట్లకు అడ్డుకట్ట వేయగలిగారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. ఇతర శాఖల అధికారుల సమన్వయంతో 14 నెలల నుంచి చేసిన ప్రయత్నం..ఉత్తమ ఫలితాలు ఇచ్చింది. బ్లాక్ స్పాట్స్‌లలో ప్రమాదాలు లేకుండా చేసింది.
అవగాహన కల్పించి..
బ్లాక్ స్పాట్స్ వద్ద మరమ్మతులు చేపట్టడమే కాదు…ఆయా చోట్ల వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాహనాలను ఎలా నడపాలో సూచనలు ఇస్తున్నాం.
-పవన్, ఇన్స్పెక్టర్,రాచకొండ ట్రాఫిక్ ఇంజినీరింగ్ విభాగం