సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో నగరవాసుల సౌకర్యార్థం నిర్మించిన 5435 పబ్లిక్ టాయిలెట్లను మరింత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇటీవల 2173 ప్రాంతాల్లో 5435 మరుగుదొడ్ల(కుర్చీల)ను నిర్మించింది. ఈ టాయిలెట్ల నిర్వహణను స్థానిక ఏజెన్సీలకు టెండర్ నిబంధనల ప్రకారం అప్పగించింది. వీటిని ప్రతి రోజు మూడు నుంచి ఐదు సార్లు శుభ్రపరిచేందుకు 57 ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కమర్షియల్ ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో ఉన్న టాయిలెట్లను కనీసం ఐదుసార్లు, ఇతర ప్రాంతాల్లో మూడు సార్లు శుభ్రపరిచ్చేలా చర్యలు చేపట్టింది. ప్రతి టాయిలెట్‌కు క్యూఆర్ కోడ్ కేటాయించి ఆయా టాయిలెట్లను శుభ్రపరిచే సమయంతో పాటు ఈ టాయిలెట్ల నిర్వహణపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. క్యూఆర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు చేపట్టి నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా టాయిలెట్ల నిర్వహణకు జీహెచ్ఎంసీ ప్రతి ఏటా రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నది.