కాచిగూడ, ఫిబ్రవరి 9 : కులగణన చేయకపోతే కేంద్రంపై బీసీల తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ హెచ్చరించారు. ప్రధాని బీసీగా ఉండి బీసీలకే తీవ్ర అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. బుధవారం ఆయన కాచిగూడలో విలేకరులతో మాట్లాడుతూ బీసీల వాటాను కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో త్వరలో లక్షలాది మందితో జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీల హక్కులను సాధించే వరకు దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ.. ఒకే తాటిపై ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగణన సాధిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు.