ఖైరతాబాద్, ఫిబ్రవరి 9 : ప్రముఖ సీనియర్ ఫొటోగ్రాఫర్, చిత్రకారులు గుడిమల్ల భరత్ భూషణ్ కుటుంబానికి అండగా నిలుస్తామని వక్తలు స్పష్టం చేశారు. భరత్ భూషణ్ మిత్రబృందం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సంతాప, సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ ఎల్. రమణ, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్ రావు, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంధ భాస్కర్, ప్రముఖ దర్శకులు బి. నర్సింగరావు, భరత్ భూషణ్ సతీమణి సుభద్ర, కుమారుడు అభినవ్, కుమార్తె అనుప్రియ, సోదరుడు డాక్టర్ గోవింద్, కుమార్‌లు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ భరత్‌భూషణ్ సామాన్య కుటుంబం నుంచి స్వయం ప్రతిభతో ఎదిగిన ఒక ఛాయచిత్రకారుడని అన్నారు. డబుల్ బెడ్రూం గృహం, కుటుంబంలోని ఒకరి ఉద్యోగం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తాను తన మొదటి వేతనం రూ.50వేలను ఆయన కుటుంబానికి అందజేస్తానని తెలిపారు. వి. ప్రకాశ రావు మాట్లాడుతూ భరత్ జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగా ఉండటానికి ఓ పుస్తకాన్ని రూపొందించాలన్నారు. సీనియర్ జర్నలిస్టు, ప్రెస్‌క్లబ్ మాజీ సభ్యులు నరేందర్ జి. పద్మశాలి మాట్లాడుతూ చేనేత జ్యోతి మీడియా హౌజ్ ఆధ్వర్యంలో భరత్ భూషణ్ మెమోరియల్ ఫొటో జర్నలిస్ట్ అవార్డు కింద ఉత్తమ ఫొటో జర్నలిస్టులకు రూ.10,116 నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు.
సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీనియర్ జర్నలిస్టు సజయా, సీనియర్ ఫొటోగ్రాఫర్ రవీందర్‌రెడ్డి, కవయిత్రి విమల, ఆంధ్రజ్యోతి నవ్య సంపాదకురాలు వసంత లక్ష్మి, పసునూరి రవీందర్, అంబటి సురేందర్ రాజు, తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు పల్లె రవి కుమార్, ప్రొఫెసర్ రాములు, కందగట్ల స్వామి, మానవహక్కుల వేదిక ప్రతినిధి జీవన్ కుమార్, నందిరాజు రాధాకృష్ణ, అరుణోదయ విమలక్క, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, బి. రాజమౌళి చారి తదితరులు పాల్గొన్నారు.