ఎర్రగడ్డ, ఫిబ్రవరి 9 : బోరబండ పీలీదర్గా ప్రాంగణంలోని ‘వెంకటఖ్వాజా’ దర్గా 35వ ఉర్సు ఉత్సవాలను మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు కలిసి జరపటం విశేషం. మతసామరస్యాన్ని చాటే ఈ ఉర్సు ఉత్సవాలకు జంట నగరాలతోపాటు ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. దర్గా ప్రాంగణంలోనే బస చేయటానికి విడిదిని ఏర్పాటు చేశారు. బుధవారం అభిషేకం, ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థన, ప్రసాద వితరణ, పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఏటా శివరాత్రికి 20 రోజుల ముందు వెంకటఖ్వాజా ఉర్సును నిర్వహించటం ఆనవాయితీగా వస్తున్నది.