కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై ఆగని ఆక్రోశం.. పదేపదే అక్కసు.. చెప్పేవి నీతులు.. చేసేది గుండుసున్నా.. అండగా ఉన్నామంటూ మొండిచెయ్యి..ఇదే ప్రధాని మోదీ నైజమంటూ తెలంగాణ ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కుతున్నది. రాష్ట్ర విభజనపై అర్థరహితంగా, అవగాహన లేకుండా మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని ఉద్యమకారులు రగిలిపోతున్నారు. అమరుల త్యాగాలు, విరోచిత పోరాటాల వల్లే రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమైందని..నాడు, నేడు బీజేపీ చేసిందేమీ లేదని దుయ్యబడుతున్నారు. చట్ట సభల సాక్షిగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రధాని మాట్లాడారని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సిటీబ్యూరో/మేడ్చల్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ వేదికగా రాజ్యసభలో తెలంగాణపై ప్రధాని నరేం ద్ర మోదీ మరో మారు విషం కక్కిన తీరుపై నగర నేతలు, యువత, పలు ప్రజా సంఘాలు ఆగ్రహావేశాలు వెలిబుచ్చారు. రెండోసారి తన అక్కసును వెళ్లగక్కారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన ప్రధాని ప్రాంతీయ వి ద్వేశాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని పలువురు ఉద్యమకారులు, మేధావులు, ప్రొఫెసర్లు అభిప్రాయాలను వెల్లడించారు. దేశ ప్రధాని హోదాలో బాధ్యతారహితంగా మాట్లాడటంపై వారు మండిపడ్డారు. అభిప్రాయాలు వారిమాటల్లోనే..
మోదీ అక్కసు తేట తెల్లమైంది
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై మోదీ అక్కసు తేటతెల్లమయ్యింది. బీజేపీకి తెలంగాణ రాష్ట్రంపై ఉన్న అభిప్రాయం వెల్లడైంది. ఒక ఓటు రెండు రాష్ర్టాలు అంటూ కాకినాడలో బీజేపీ చేసిన తిర్మానాన్ని అపహాస్యం చేసింది. అనేక మంది యువకుల బలిదానాలకు కారణమైన బీజేపీ ఏడేళ్ల తర్వాత తెలంగాణపై ఉన్న కొపాన్ని ప్రధాని మోది వెల్లగక్కాడు. రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులను రాకుండా చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడనడానికి ఇదే నిదర్శనం.
– శంభీపూర్ రాజు, ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణపై ప్రేమలేదని నిరూపణ..
తెలంగాణపై ఎలాంటి ప్రేమ లేదని పార్లమెంట్ సాక్షిగా మోది మాట్లాడిన తీరుతో తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమంలో ప్రాణాలకు తెగించి అనేక మంది పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ దొంగ నాటకం ఆడిందని తెలిపోయింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడుగు అడుగునా అడ్డుకుంటుందన్న విషయం పార్లమెంట్ సాక్షిగా తేలిపోయింది. తెలంగాణ ప్రజలు బీజేపీ తీరును ఎండగట్టే రోజులు దగ్గర పడ్డాయి.
– జహంగీర్, ఉద్యమ నాయకుడు
తెలంగాణపై బీజేపీ వైఖరి మోడీ మాటల్లో స్పష్టం
పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. విభజన తీరుపై తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడారు. అమరవీరుల త్యాగాలను హేళన చేసేలా ప్రసంగించారు. విభజన సరిగ్గా జరగలేదని అనడం వెనుక మోడీ తెలంగాణను ఎంత శత్రువుగా చూస్తున్నాడో అర్థమవుతున్నది. తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీ వైఖరి మోడీ ఆయన మాటల్లో స్పష్టమైంది. తెలంగాణ బీజేపి నాయకులకు మాతృనేల మీద ఏ మాత్రం ప్రేమ లేదు. మోడీ వ్యాఖ్యలను చూసి బీజేపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి. బేషరతుగా తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పారు. ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.
– మాగంటి గోపీనాథ్, అధ్యక్షుడు, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ
బలిదానాలను అవమాన పర్చారు
విద్యార్థుల ఆత్మ బలిదానాలను ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా అవమాన పర్చారు. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షలను, అటు విభజన హామీలను అపహాస్యం చేస్తూ రాజ్యసభలో మోదీ ప్రసంగించడం సిగ్గుచేటు. బీజేపీ నేత, తెలంగాణ చిన్నమ్మగా పేరొందిన సుష్మా స్వరాజ్ సభలో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చారు కదా? సుష్మా స్వరాజ్ ఆత్మ క్షోభించే విధంగా ప్రధాని వ్యాఖ్యానించడం అంటే.. వారి పార్టీ వారిని వారే అవమానపర్చడం కాషాయ పార్టీకే చెల్లుతుంది.
– మాందాల భాస్కర్, చైర్మన్, ఓయూ జేఏసీ
మోదీ.. తెలంగాణ వ్యతిరేకి…
తెలంగాణ వ్యతిరేకి ప్రధాని మోది అని తెలిపోయింది. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ తీవ్ర వ్యతిరేకంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి అహర్నిషలు శ్రమిస్తుంటే బీజేపీ అడ్టుకుంటుంది.
– సత్యనారాయణ, ఉద్యమ నాయకుడు
తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుకున్న మోదీ
ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ సరిగా జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారత ప్రధాని నరేంద్ర మోడి తన అక్కసు వెళ్ళగక్కడం సబబు కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి గొప్ప ఉద్యమాన్ని నిర్మించి నాటి కేంద్రం మెడలు వంచిన పోరాటం మోదీ మీకు కనిపించలేదా? నాటి సర్కార్ అనేక కమిటీలను నియమించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన విషయం మరిచిపోయారా? రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్మించిన మహోద్యమం, వేలాది మంది అమరుల త్యాగాలను కించపరిచిన మోడీ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి.
– తెలంగాణ న్యాయవాద జేఏసీ కన్వీనర్ కొంతం గోవర్దన్‌రెడ్డి