ఎల్బీనగర్, ఫిబ్రవరి 8: దళితులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్బీనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులందరూ దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాము లబ్ధి పొందడంతో పాటు మరో రెండు కుటుంబాలకు ఉపాధిని కల్పించాలన్నారు.
దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదన్నారు. నైపుణ్యం ఉండి ఆర్థిక వనరులు, చేయూత లేక వెనకబడి ఉన్న దళితులకు సీఎం కేసీఆర్ ఉపాధి కల్పిస్తూ దిక్సూచిలా నిలుస్తున్నారని కొనియాడారు. దళితబంధుపై ప్రతిపక్ష నేతలు అవివేకంగా మాట్లాడుతున్నారని.. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పేద దళితులకు దళితబంధు అందిస్తామన్నారు. ఇందులో టీఆర్ఎస్లో పని చేసే దళితులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ కోసం అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ సమరశంఖం పూరిస్తే ఎందరో ఉద్యమకారులు తోడుగా నిలవడంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు.
విడతల వారీగా అందరికి..
దళితబంధు పథకాన్ని విడతల వారీగా అందరికి అందజేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. పథకంలో లబ్ధి చేకూరని దళితులను కొందరు రెచ్చగొట్టాలని చూస్తున్నారని.. వారి ఆటలు సాగనిచ్చేది లేదన్నారు. దళితబంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులు మంచి వ్యాపారాలు ప్రారంభించి ఉన్నతి సాధించాలని ఆకాక్షించారు. లబ్ధిదారులకు పలు వ్యాపారాలపై అవగాహన కల్పించారు. ఈ పథకం కింద రూ.9.90 లక్షలు చెల్లిస్తారని.. మిగిలిన రూ.10 వేలకు ప్రభుత్వం మరో పదివేలు కలిపి రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ నిధి దురదృష్టవశాత్తూ మరణించిన లబ్ధిదారుల కుటుంబానికి ఆదుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.
లబ్ధిదారులతో ప్రతిజ్ఞ
“దళిత జాతి సమున్నత సాధికారత కోసం ఉన్నతమైన ప్రమాణాలు పెంపొందించడంలో భాగంగా సీఎం కేసీఆర్ సమున్నత ఆలోచనలతో రూపొందించిన దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులమైన మేము ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటామని, పథకాన్ని ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ముందుకు తీసుకుని వెళ్లడంతో పాటుగా ఈ పథకం ద్వారా మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామని, అణగారిన దళిత వర్గాల అభివృద్ధికి
శాయశక్తులా కృషి చేస్తామని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం.” అంటూ దళిత బంధు లబ్ధిదారులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.
దళితులు వ్యాపారాలతో ముందడుగేయాలి..
ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌గుప్తా
దళితబంధు పథకాన్ని ఉపయోగించుకొని దళితులు వ్యాపారాలతో ముందడుగేయాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధును అమలు చేస్తున్నారని.. దళితులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెరుకు ప్రశాంత్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు భవాని ప్రవీణ్‌కుమార్, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, నల్ల రఘుమారెడ్డి, శ్రీనివాస్ నాయక్, టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు లింగాల రాహుల్‌గౌడ్, చెన్నగోని శ్రీధర్ గౌడ్, ముడుపు రాజిరెడ్డి, కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, జక్కల శ్రీశైలం యాదవ్, చింతల రవికుమార్, సత్యంచారి, జక్కిడి మల్లారెడ్డి, మల్లీశ్వరి రెడ్డి, దళిత నాయకులు కట్టా వెంకటేశ్, గంగం శివశంకర్, పార్శపు శ్రీధర్, మల్లెపాక యాదగిరి, ప్రసన్న పాల్గొన్నారు.
సంతోషంగా ఉంది..
దళితబంధుతో మా జీవితాలు మారిపోతాయి. మాలాంటి బడుగు జీవులకు చేయూతనిచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దళితబంధును తీసుకొచ్చారు. ఈ పథకంలో ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాది పేద కుటుంబం. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డు. ఇద్దరు కుమారులు ట్యాక్సీ నడుపుతారు. మాకు ఇచ్చే నగదుతో కారు కొంటాం. మా కుటుంబానికి ఆదెరువు చూపెడుతున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– నాగమణి, గడ్డిఅన్నారం
కుటుంబాన్ని పోషించుకుంటా..
దళితబంధుతో మా కుటుంబంలో వెలుగులు నిండటం ఖాయం. నా భర్త మరణించాడు. నాకు నలుగురు ఆడపిల్లలు. ఇల్లు లేదు. మొత్తం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ పథకంలో వచ్చే నిధులతో కిరాణ షాపు పెట్టుకుంటా. ఎలాంటి కష్టం లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటా. ఇంతటి గొప్ప అవకాశం ఇస్తున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
– పి.జయ, చైతన్యపురి
దారి చూసుకుంటాం..
దళితబంధుతో దళితులు ఆర్థికంగా వృద్ధి చెందొచ్చు. దళితుల జీవితాల్లో వెలుగులు ఖాయం. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధును సద్వినియోగం చేసుకుంటాం. వ్యాపారం ద్వారా ఉపాధి పొందేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఆదెరువు లేకుండా బతుకుతున్నాం. దళిత బంధుతో మాకో దారి దొరుకుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.
– కట్టా వెంకటేశం, చంపాపేట
దళిత బాంధవుడు సీఎం కేసీఆర్
దళితబంధుతో సీఎం కేసీఆర్ దళితులకు ఆప్త మిత్రుడయ్యారు. దళితబంధును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగుతాం. ఇప్పటివరకు సమైక్య నాయకులు దళితులను ఓటు బ్యాంకుగానే చూశారు. దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. పథకంతో లబ్ధి పొంది మరికొందరికి ఉపాధి కల్పిస్తాం.
– గంగం శివశంకర్, సాహెబ్‌నగర్