మైలార్‌దేవ్‌పల్లి, ఫిబ్రవరి 8: తీరు మార్చుకుంటు న్నది. విద్యార్థులను ఉన్నతంగా ఎదిగేలా చేస్తున్నది. తెలుగుతో పాటు ఆంగ్లమాధ్యమాన్ని సైతం ప్రవేశపెట్టి పిల్లలను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నది మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ప్రస్తుతం ఈ పాఠశాలలో 970 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే కొత్తగా ఆంగ్లమాధ్యమంలో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. పాఠశాల మొత్తం ఐదు వేల గజాల విస్తీర్ణంలో ఉండగా 24 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇక ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు 15 తరగతి గదులున్నాయి. ఏడు గదులు ఇంగ్లిష్, ఎనిమిది గదులు తెలుగు మీడియం విద్యార్థులకు కేటాయించారు. ఆరో తరగతిలో అడ్మిషన్లు పెరగడంతో మూడు సెక్షన్లుగా విభజించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం 300 అడ్మిషన్లు వస్తున్నా వసతులు చాలకపోవడంతో వెనక్కి పంపుతున్నామని ప్రధానోపాధ్యాయుడు పి.మల్లారెడ్డి తెలిపారు. మరో 10 అదనపు తరగతి గదులుంటే మరిన్ని సెక్షన్లు పెట్టి పాఠాలు చెప్పేవారమని అంటున్నారు. ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో రెండుసార్లు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు అదనపు గదుల కోసం విన్నవిస్తే నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.
వంద శాతం ఉత్తీర్ణత..
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రతి సంవత్సరం వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 2019-20లో వంద, 2020-21లో వందశాతం ఉత్తీర్ణత సాధించి డివిజన్‌లోనే అత్యుత్తమ పాఠశాలగా రికార్డు నెలకొల్పింది. 2019-20లో స్కూల్ టాపర్‌గా నిలిచిన నికిల్‌రెడ్డి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాడు.
కార్పొరేట్‌కు దీటుగా..
దాతలు సహకరిస్తే పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా మార్చొచ్చు. పాఠశాలలో వసతుల కల్పనకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. దాతలు ముందుకు రావాలని కోరుతున్నాం. తాగడానికి మంచినీరు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ నుంచి వాటర్ ట్యాంకర్ వస్తున్నా సరిపోవడం లేదు. ఈ పాఠశాలలో మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.
– మల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది..
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటే మెరుగైన వసతులు కల్పించాలి. ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపిక చేసి అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల ప్రైవేట్ పాఠశాలలు మూతపడటం ఖాయం. ప్రతి సంవత్సరం ఈ పాఠశాలకు విద్యార్థుల తాకిడి పెరుగుతున్నది. పాఠశాలలో కావాల్సిన స్థలం ఉన్నందున అదనపు తరగతి గదులు నిర్మించాలి.
-ఉదయ్‌కుమార్, ఉపాధ్యాయుడు
ఆటల ద్వారా బోధన..
మ్యాజిక్ బస్, యునైటెడ్ ఆఫ్ హైదరాబాద్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పాఠశాలకు ఓ వలంటీర్‌ను ఏర్పాటు చేయగా.. ఆటపాటల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారు. తరగతుల్లో చెప్పిన పాఠాలే కాక విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు ఆటల ద్వారా విద్యను అందిస్తున్నాం.
– సురేశ్, ఉపాధ్యాయుడు