మేడ్చల్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడులకు స్వచ్ఛ అవార్డులు ప్రకటించనున్నారు. స్వచ్ఛ విద్యాలయం పేరిట ఈ పురస్కారాలను ప్రభుత్వం అందజేయనున్నది. మౌలిక సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత, పచ్చందాలను పరిగణలోకి తీసుకుని పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు పాఠశాలల నుంచి విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మార్చి చివరి వారం వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మేడ్చల్-మల్కాజిగిరి మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ సూచించింది. స్వచ్ఛ విద్యాలయం పురస్కార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు.
ఫొటోలు జతపరచాలి..
స్వచ్ఛ అవార్డుకు దరఖాస్తు చేసే పాఠశాలలకు సంబంధించిన మౌలిక వసతులు, పరిశుభ్రత, పచ్చని అందాల ఫొటోలు తీసి దరఖాస్తుతో పంపాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత ప్రత్యేక కమిటీ పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. అక్కడి వసతులను గుర్తించి ప్రభుత్వానికి సమర్పించనున్నది. అంతేకాక కొవిడ్ నేపథ్యంలో పాఠశాలల్లో తీసుకున్న జాగ్రత్తలను అదనపు అర్హతలుగా పరిగణించనున్నారు.
పురస్కారాలకు దరఖాస్తు చేయాలి..
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు స్వచ్ఛ పురస్కారాల కోసం దరఖా స్తు చేయాలి. ఈ దరఖాస్తులకు పాఠశాలల్లోని మౌలిక వసతులకు సంబంధించిన ఫొటోలను జతపర్చాలి. వసతుల కల్పన, పరిశుభ్రతను పరిగణలోకి తీసుకొని పాఠశాలలను అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారంతో అన్ని పాఠశాలలు ఇప్పటికే పచ్చటి అందాలను సంతరించుకున్నాయి.
– ఎస్.ఎస్.ఎన్ ప్రసాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి