బంజారాహిల్స్, ఫిబ్రవరి 8: ఖైరతాబాద్‌లో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక తుదిదశకు చేరింది. నియోజకవర్గంలో దాదాపు 150 మంది దళితబంధు కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో అర్హులను గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డా.రమేశ్ మంగళవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో సమావేశమయ్యారు. దరఖాస్తులు, దరఖాస్తుదారులు అందించిన వ్యాపార వివరాలు, స్వయం ఉపాధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి వారి ఆర్థిక పరిస్థితి పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల తుదిజాబితాను ఖరారు చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మొదటి దశలో 100 మందికి.. రెండో దశలో రెండు వేల మందికి దళితబంధు అందజేస్తామని వివరించారు. అర్హులందరికి దళితబంధు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. పదిరోజుల్లో తొలివిడుత దళితబంధు నిధులు విడుదల చేస్తామన్నారు.